కోటా రగడ : వాహనాలకు నిప్పంటించిన గుజ్జర్లు

10 Feb, 2019 16:09 IST|Sakshi

జైపూర్‌ : విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ రాజస్ధాన్‌లో గుజ్జర్లు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఆదివారం ఘర్షణ చెలరేగడంతో దోల్పూర్‌ హైవే రణరంగమైంది. జాతీయ రహదారిని నిర్భందించిన నిరసనకారులు పలు వాహనాలకు నిప్పంటించారు. సవోయి మధోపూర్‌ జిల్లాలో వరుసగా మూడోరోజూ రైలు పట్టాలపై గుజ్జర్లు ధర్నా నిర్వహించి కోటా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరుతూ నినాదాలతో హోరెత్తించారు.

కాగా, గుజ్జర్ల ఆందోళనతో వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే గత రెండు రోజులుగా ఈ ప్రాంతం మీదుగా వచ్చే రైళ్లను రద్దు చేయగా, పలు రైళ్లను దారిమళ్లించింది. తమకు తక్షణమే ప్రత్యేక కేటగిరీ కింద 5 శాతం రిజర్వేషన్‌ను ప్రకటించాలని గుజ్జర్ల ఉద్యమ నేత కిరోరి సింగ్‌ భైంస్లా డిమాండ్‌ చేశారు. రాజస్ధాన్‌ ప్రభుత్వం గతంలో గుజ్జర్లకు అత్యంత వెనుకబడిన వర్గాల కోటా కింద ఒక శాతం రిజర్వేషన్‌ ప్రకటించింది.

మరిన్ని వార్తలు