ఒక్కొక్కరికి 20 డాలర్లు; పాక్‌ చర్య సిగ్గుచేటు

21 Oct, 2019 10:55 IST|Sakshi

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లో గల కర్తార్‌పూర్‌ సాహెబ్‌ గురుద్వారా ప్రవేశానికై 20 డాలర్లు వసూలు చేయడం దారుణమని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ విమర్శించారు. తమ మత విశ్వాసంపై పాక్‌ వ్యాపారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా... కర్తార్‌పూర్‌ కారిడార్‌ను నవంబర్‌ 9న ప్రారంభించనున్నట్టు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌లోని సిక్కు తీర్థ యాత్రికులు వీసా లేకుండా పవిత్ర కర్తార్‌పూర్‌ సాహిబ్‌ వెళ్లే అవకాశం లభించింది. అయితే గురుద్వార ప్రవేశానికై ఒక్కో భక్తుడు 20 యూఎస్‌ డాలర్లు చెల్లించాలని పాక్‌ పేర్కొంది. అదే విధంగా ఈ కారిడార్‌ను ప్రారంభించడం వల్ల స్థానికులకు ఆతిథ్య రంగంలో ఉపాధి లభిస్తోందని ఇమ్రాన్‌ అభిప్రాయపడ్డారు.

ఈ విషయంపై స్పందించిన హర్‌సిమ్రత్‌ కౌర్‌ సోషల్‌ మీడియా వేదికగా ఇమ్రాన్‌ ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు... ‘ కర్తార్‌పూర్‌ సాహిబా సందర్శనకు వచ్చే భక్తుల నుంచి 20 డాలర్లు వసూలు చేస్తామని పాక్‌ చెప్పడం దారుణం. పేద భక్తుల పరిస్థితి ఏంటి? వారు ఎలా అంతమొత్తం చెల్లించగలరు. మా విశ్వాసంతో పాక్‌ వ్యాపారం చేయాలని చూస్తోంది. ప్రవేశ రుసుం వసూలు చేయడం వల్ల విదేశీ మారకద్రవ్యం పెరిగి పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పడం నిజంగా సిగ్గుచేటు’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ సాహెబ్‌ తన జీవితంలోని చివరి 18 ఏళ్ల కాలాన్ని కర్తార్‌పూర్‌ సాహెబ్‌ గురుద్వారాలో గడిపారు. 1539లో  అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఈ గురుద్వార పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో గల కర్తార్‌పూర్‌(భారత్‌- పాకిస్థాన్‌ సరిహద్దు నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది) గ్రామంలో ఉంది. ఈ నేపథ్యంలో గురునానక్‌ 550 జయంతి సందర్భంగా అంతర్జాతీయ సరిహద్దు నుంచి డేరాబాబా నానక్‌ వరకు కారిడార్‌ నిర్మాణానికి భారత్‌ సంకల్పించింది. అటువైపు దార్బర్‌ సాహిబ్‌ వరకు కారిడార్‌ను పాక్‌ చేపట్టింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా