గుట్టలు గుట్టలుగా పెండింగ్ కేసులు!

3 Mar, 2016 18:38 IST|Sakshi
గుట్టలు గుట్టలుగా పెండింగ్ కేసులు!

న్యూఢిల్లీ: దేశంలో న్యాయస్థానాల ముందు పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య కుప్పలు తెప్పలుగా పెరిగిపోతూనే ఉంది. ఏళ్లకు ఏళ్లుగా సుప్రీంకోర్టు,  హైకోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య చూస్తే విస్తుపోవాల్సిందే. సివిల్, క్రిమినల్ కేసుల వారీగా విచారణ పెండింగ్‌ లో ఉన్న కేసుల వివరాలను సుప్రీంకోర్టు తాజాగా వెల్లడించింది.

సుప్రీంకోర్టులోనూ భారీగా పెండింగ్..
2016 ఫిబ్రవరి 19 వరకు తన ముందున్న పెండింగ్ కేసు వివరాలను సుప్రీంకోర్టు వెల్లడించింది. 48,418 సివిల్ కేసులు, 11,050 క్రిమినల్ కేసులు తన విచారణ కోసం నిరీక్షిస్తున్నట్టు తెలిపింది. 19-2-2016 నాటికి పదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న కేసులు సివిల్‌ కేటగిరీలో 1,132, క్రిమినల్ కేటగిరీలో 84 ఉన్నాయని తెలిపింది. గత మూడేళ్ల కాలంలో తాము పరిష్కరించిన కేసుల సంఖ్యను కూడా సుప్రీంకోర్టు ఈ వివరాల్లో వెల్లడించింది. 2013లో 40,189 కేసులు, 2014లో 45,042 కేసులు, 2015లో 47,424 కేసులు, ప్రస్తుత సంవత్సరం ఫిబ్రవరి 19 వరకు 6,054 కేసులు పరిష్కరించినట్టు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.

హైకోర్టులోన్లూ..
ఇక హైకోర్టుల విషయానికొస్తే.. 2014 డిసెంబర్ 31వరకు 31,16,492 కేసులు సివిల్ కేటగిరీలో, 10,37,465 కేసులు క్రిమినల్ కేటగిరీలో పెండింగ్‌ లో ఉన్నాయి. 2014 డిసెంబర్ 31 నాటికి పదేళ్లకు పైగా విచారణ పెండింగ్‌లో ఉన్న కేసులు సివిల్ కేటగిరీలో 5,89,631, క్రిమినల్ కేటగిరీలో 1,87,999 కేసులు ఉన్నాయి..

జిల్లా, సబార్డినేట్ న్యాయస్థానాల్లోనూ..
డిస్ట్రిక్ట్, సబార్డినేట్ కోర్టుల్లోనూ చాలా కేసులు పరిష్కారం కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్నాయి. 2014 డిసెంబర్ 31 నాటికి జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో పెండింగ్ కేసులో సివిల్ కేటగిరీలో 82,34,281, క్రిమినల్ కేటగిరీలో 1,82,54,124 కేసులు ఉన్నాయి. ఇక పదేళ్లకుపైగా పెండింగ్ లో ఉన్న కేసులు ఈ న్యాయస్థానాల ముందు సివిల్ కేటగిరీలో 6,11,658, క్రిమినల్ కేటగిరీలో 14,32,079 కేసులు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో...
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు 2012 నుంచి 2014 వరకు పరిష్కరించిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. 2012లో 66,130, 2013లో 58,278, 2014లో 66,239 కేసులను ఉమ్మడి హైకోర్టు పరిష్కరించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా,  సబార్డినేట్ కోర్టులు 2012లో 6,06,447 కేసులు, 2013లో 5,14,867 కేసులు, 2014లో 6,47,130 కేసులను పరిష్కరించాయి.
 

మరిన్ని వార్తలు