ఏవోబీలో మావోయిస్టు అగ్రనేతలు?

12 May, 2019 12:31 IST|Sakshi

సాక్షి, రాయగడ ‌: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారంతో ఆ ప్రాంతంలో కూంబింగ్‌ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అరుణ, నవీన్‌ మకాం వేసినట్లు సమాచారంతో వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కొరాపుట్‌ జిల్లా పాడువా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కిటుబ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల కిట్‌లో కీలక సమాచారం లభించడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సరిహద్దు జిల్లాల్లో జవాన్ల కూంబింగ్‌ ఉద్ధృతంగా సాగుతుండటంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

కాగా సీలేరులో ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ మన్యంలో హై అలర్ట్‌ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం రాయగడ, కలహండి జిల్లాల సరిహద్దులో త్రిలోచనపూర్‌ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు టార్గెట్‌గా మావోయిస్టులు మందుపాతర పేల్చగా...జవాన్లు తృటిలో తప్పించుకున్నారు. దీంతో కల్యాణ సింగుపురం ప్రాంతంలో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ నాల్గవ బెటాలియన్‌, ముకుందపుర్‌ సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌ హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని భారీగా కూంబింగ్‌ చేపట్టారు. కాగా ఈ నెల 10వ తేదీన మల్కన్‌గిరి, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులు పేల్చిన ల్యాండ్‌మైన్‌ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వారిని చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్‌లో విశాఖకు తరలించారు. 

మరిన్ని వార్తలు