తెలుగు వారిని ‘గారు’ అనాలి

15 Sep, 2017 02:11 IST|Sakshi
తెలుగు వారిని ‘గారు’ అనాలి

రాష్ట్రపతి కోవింద్‌

న్యూఢిల్లీ: హిందీ వాళ్లు తెలుగువారితో మాట్లాడుతున్నప్పుడు ‘గారు’ అని సంబోధించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సూచించారు. అలాగే తమిళులకు వణక్కం అని చెప్పాలనీ, సిక్కులు ఎదురైతే ‘సత్‌ శ్రీ అకాల్‌’ అనాలని రామ్‌నాథ్‌ కోరారు. హిందీ దినోత్సవం సందర్భంగా గురువారం హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రామ్‌నాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందీకి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభింపజేయడం కోసం ఇతర భాషలు, ఆ భాషలు మాట్లాడే ప్రజలను హిందీ వాళ్లు మరింత ఎక్కువగా గౌరవించాలని రామ్‌నాథ్‌ అన్నారు.

దశాబ్దాల క్రితమే హిందీని అధికారిక భాషగా గుర్తించినా దేశంలోని కొన్ని భాగాల్లో ఇప్పటికీ హిందీ అంటే వ్యతిరేకత ఉందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరు మెట్రో స్టేషన్లలో హిందీలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయడాన్ని కన్నడ సంఘాలు వ్యతిరేకించడం, గతంలో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాలు జరగడాన్ని రామ్‌నాథ్‌ ప్రస్తావించారు. హిందీని తమపై రుద్దుతున్నారని వారంతా భావిస్తున్నారనీ, ఇతర భాషలను, సంప్రదాయాలను గౌరవించడం ద్వారా దేశంలో ఐక్యత వర్ధిల్లుతుందన్నారు.

మరిన్ని వార్తలు