తండ్రి శవానికి ఐపీఎస్‌ అధికారి చికిత్స!

20 Feb, 2019 10:43 IST|Sakshi

భోపాల్‌ : ఓ ఐపీఎస్‌ అధికారి తన తండ్రి శవానికి ఆయుర్వేద చికిత్స చేయించిన ఘటన మధ్యప్రదేశ్‌లో కలకలం రేపింది. ఈ ఘటనపై తక్షణమే వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ డీజీపీని ఆదేశించింది. వివరాలు.. మధ్యప్రదేశ్‌ ఏడీజీ(అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌) రాజేంద్ర మిశ్రా అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి కేఎం మిశ్రా(84)ను భోపాల్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో కేఎం మిశ్రా జనవరి 14న మరణించారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా డెత్‌ సర్టిఫికెట్‌ కూడా జారీ చేశాయి.

అయితే తన తండ్రి మరణించలేదని భావించిన రాజేంద్ర మిశ్రా.. ఆయన శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని ఆయుర్వేద చికిత్స చేయించడం ప్రారంభించారు. మిశ్రా ఇంటికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఇటీవలే కొంత మంది భద్రతా సిబ్బందిని నియమించింది. ఈ క్రమంలో ఇంట్లో జరుగుతున్న ఈ తతంగం గురించి బయటపడింది. దీని గురించి తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించిగా...ఇది పూర్తిగా తమ సొంత విషయమని, తమ ఇంట్లోకి వచ్చే అధికారం ఎవరికీ లేదని మిశ్రా మీడియాను అడ్డగించారు.

కాగా ఈ విషయం గురించి మీడియాలో ప్రసారం కావడంతో మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. అల్లోపతిక్‌, ఆయుర్వేదిక్‌ వైద్య నిపుణులతో ఓ కమిటీ వేసి... ఈ వ్యవహారాన్ని తక్షణమే తేల్చాల్సిందిగా డీజీపీని ఆదేశించింది. ఈ విషయం గురించి తమకు నివేదిక అందజేయాలని పేర్కొంది.

మరిన్ని వార్తలు