Election Commission: రూ.1,760 కోట్లు.. ఐదు రాష్ట్రాల్లో పట్టుబడిన మొత్తం

20 Nov, 2023 22:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికలు జరుగుతున్న ఐదు  రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ. 1,760 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది.

అక్టోబరు 9న ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఐదు రాష్ట్రాల్లో నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువుల రూపంలో ఈ మొత్తం పట్టుపడినట్లు ఎలక్షన్‌ కమిషన్‌  ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో 2018 ఎన్నికల్లో పట్టుబడిన మొత్తం కంటే ఈసారి పట్టుబడినది దాదాపు ఏడు రెట్లని పేర్కొంది. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో రూ. 239.15 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను ఈసీ జప్తు చేసింది.

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో ఎలక్షన్లు ముగియగా రాజస్థాన్‌లో నవంబర్ 25, తెలంగాణలో నవంబర్ 30 తేదీన పోలింగ్ జరగనుంది. 

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్.. ప్రలోభ రహితంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని అభ్యర్థులకు, పార్టీలకు స్పష్టం చేసినట్లు ఈసీ పేర్కొంది. ఈసారి ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎలక్షన్‌ కమిషన్ ఎన్నికల వ్యయ పర్యవేక్షణ వ్యవస్థ (ESMS) ద్వారా పర్యవేక్షణ ప్రక్రియలో సాంకేతికతను కూడా పొందుపరిచినట్లు తెలిపింది.

ఈసీ ప్రకటన ప్రకారం.. ఆసక్తికరంగా మిజోరాంలో నగదు, విలువైన వస్తువులేవీ పట్టుబడలేదు కానీ రూ. 29.82 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 228 మంది అధికారులను వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 194 అసెంబ్లీ నియోజకవర్గాలను అత్యధిక వ్యయం జరిగే స్థానాలుగా గుర్తించిన ఈసీ.. వీటిపై నిశిత పర్యవేక్షణ పెట్టింది.

మరిన్ని వార్తలు