నేషనల్ హెరాల్డ్ కేసులో రూ.752 కోట్లు ఈడీ సీజ్

22 Nov, 2023 10:02 IST|Sakshi

ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సంబంధం ఉన్న యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్‌(ఏజేఎల్‌)కు చెందిన రూ. 752 కోట్ల విలువైన ఆస్తిని ఈడీ అటాచ్ చేసింది. యంగ్ ఇండియాకు చెందిన రూ.90 కోట్ల ఆస్తిని, నేషనల్ హెరాల్డ్‌కు చెందిన ఢిల్లీ,  ముంబయిలోని భవనాలు, లక్నోలోని నెహ్రూ భవన్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఏజేఎల్ భవనాల విలువ రూ.661.69 కోట్లు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. 

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కొనుగోలులో మోసం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వార్తాపత్రికలను ప్రచురించడానికి రాయితీ ధరలకు భూమిని పొందిన అసోసియేటెడ్ జర్నల్.. 2008లో తన కార్యకలాపాలను మూసివేసింది. ఆ ఆస్తులను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందనేది ప్రధాన ఆరోపణ. ఏజేఎల్‌తో వందల కోట్ల ఆస్తులు సంపాదించేందుకు కుట్ర జరిగినట్లు తేలింది. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. 

కాగా.. ఎన్నికల ముందు అసోసియేట్ జర్నల్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం బీజేపీ భయాన్ని సూచిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్దే ఎద్దేవా చేశారు. ఓటమిని దారి మళ్లించడానికి అసోసియేట్ జర్నల్ ఆస్తుల వ్యవహారాన్ని కేంద్రం ముందుకు తీసుకువచ్చిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సంఘ్వీ ఆరోపించారు. ప్రతీకార రాజకీయాలు కాంగ్రెస్‌ను నాశనం చేయలేవని అన్నారు.

ఇదీ చదవండి: 'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్‌ ఫైనల్‌లో గెలిచేది!

మరిన్ని వార్తలు