కొత్త సీఈసీగా హరిశంకర్ బ్రహ్మ

17 Jan, 2015 02:01 IST|Sakshi
కొత్త సీఈసీగా హరిశంకర్ బ్రహ్మ

ఈ నెల 25న ఈఆర్‌ఎంఎస్ ప్రారంభం
 న్యూఢిల్లీ: దేశ 19వ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా హరిశంకర్ బ్రహ్మ(64) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం తన ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రపంచం దృష్టి అంతా ప్రస్తుతం ఢిల్లీపై ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు సీఈసీగా ఉన్న వీఎస్ సంపత్ గురువారం పదవీవిరమణ చేశారు. అత్యుత్తమ సేవలందించడం ఎన్నికల సంఘం దీర్ఘకాలిక లక్ష్యమని బ్రహ్మ వివరించారు. ఎన్నికల నిర్వహణను మెరుగుపర్చేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు.

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనవరి 25న ఎన్నికల సంఘం ‘ఎలక్ట్రానిక్ రోల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఈఆర్‌ఎంఎస్)’ను దేశవ్యాప్తంగా ప్రారంభిస్తోందని వెల్లడించారు. ఇటీవలి సుప్రీంకోర్టు నిర్దేశాల మేరకు ప్రవాస భారతీయులకు ఈ- ఓటింగ్ ద్వారా ఓటుహక్కు కల్పించేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తోందన్నారు. 1975 ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి బ్రహ్మ అసోంకు చెందినవారు. ఈ ఏప్రిల్ 19తో ఆయనకు 65 ఏళ్లు నిండనుండటంతో అప్పటివరకు మాత్రమే ఆయన సీఈసీగా ఉంటారు.
 
 ముందే నిషేధించాలి: వీఎస్ సంపత్
 హత్య తదితర తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఎన్నికల సంఘం సిఫారసు చేసిందని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ వెల్లడించారు. అలాగే, చెల్లింపు వార్తలను(పెయిడ్ న్యూస్) ఎన్నికల నేరంగా పరిగణించాలని కూడా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు సంపత్ గురువారం తెలిపారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల ఖర్చుపైనా పరిమితి విధించాలని సిఫారసు చేశామన్నారు.
 
  శిక్ష పడిన తరువాత నిషేధించడం కాకుండా.. కోర్టుల్లో ఐదేళ్లు, లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడే అవకాశమున్న కేసులున్న వ్యక్తులందరినీ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించడం ద్వారా రాజకీయాల్లో నేరచరితుల ప్రవేశాన్ని అడ్డుకోవచ్చన్నారు. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి చాన్నాళ్లుగా ఈసీ ఈ డిమాండ్ చేస్తోందని.. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సంబంధిత సవరణ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఆరేళ్లపాటు సంపత్ ఎన్నికల కమిషనర్‌గా సమర్థ్ధవంతంగా విధులు నిర్వర్తించారు.
 
 సంపత్ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు..
   ఎన్నికల కోడ్‌ను చట్టంగా మార్చే ప్రతిపాదనకు ఈసీ వ్యతిరేకం   నా హయాంలో ఓటరు కేంద్రంగా ఈసీ మారడం సంతృప్తినిచ్చింది   రాజకీయ పార్టీలకు వచ్చే నిధుల విషయంలో పారదర్శకత లేదు. సంబంధిత చట్టం చాలా బల హీనంగా, అసంపూర్తిగా ఉంది. భారత్‌లో రాజకీయ పార్టీల నియంత్రణకు సమగ్ర చట్టం లేదు   లోక్‌సభ ఎన్నికల సమయంలో వారణాసిలో నరేంద్రమోదీ పాల్గొంటున్న ర్యాలీకి అనుమతి నిరాకరించడం తప్పని భావించడం లేదు.

మరిన్ని వార్తలు