విజయవాడలో భూమి కొన్న బాబు? | Sakshi
Sakshi News home page

విజయవాడలో భూమి కొన్న బాబు?

Published Sat, Jan 17 2015 2:15 AM

విజయవాడలో భూమి కొన్న బాబు? - Sakshi

నివాసం, టీడీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మించేందుకే..  
ఎకరా విలువ రూ.3 కోట్ల నుంచి 4 కోట్లు


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విజయవాడ సమీపంలో నాలుగెకరాల స్థలం కొనుగోలు చేసినట్టు తెలిసింది. పోరంకి సమీపంలో ఉన్న ఈ స్థలంలో ఇల్లు, పక్కనే పార్టీ రాష్ట్ర కార్యాలయ భవనం నిర్మించాలని కొనుగోలు చేసినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ భూమిని చంద్రబాబు సొంతంగా కొనుగోలు చేశారని పార్టీ వర్గాలు చెబుతుండగా, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కొన్నట్లు ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి. సాధ్యమైనంత తొందరగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలని భావించినా తాత్కాలికంగా కొంత సమయం తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది.

విజయవాడ లోక్‌సభ సభ్యుడు, కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నాని సంస్థకు చెందిన బస్సులు నిలిపే స్థలం సమీపంలో కొత్త ఆటోనగర్ నుంచి ఎనికేపాడు వెళ్లే రోడ్డు మార్గంలో ఈ భూమి ఉంది. ఇక్కడ ఎకరా మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల రూపాయలు పలుకుతున్నట్టు సమాచారం. ఈ ప్రాంతం పోరంకి గ్రామం పరిధిలోకి వస్తుందని, అయితే కచ్చితంగా ఎప్పుడు కొనుగోలు చేసింది తెలియదని టీడీపీ స్థానిక నాయకుడొరు చెప్పారు. పార్టీ ఏపీ శాఖకు ప్రత్యేకంగా కార్యాలయం నిర్మించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు స్థలం కొనుగోలు చేశారని ఆ నాయకుడు తెలిపారు.
 
ఆ అతిథిగృహానికి వాస్తు సరిగా లేదు
విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించేందుకు ఇటీవల లక్షల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేసిన రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహం (స్టేట్ గెస్ట్‌హౌస్) వాస్తు సరిగా లేదని సీఎం చంద్రబాబు వ్యక్తిగత సిద్ధాంతి రాఘవయ్య తేల్చినట్లు సమాచారం.

ఇటీవల ఆ అతిథిగృహాన్ని పరిశీలించిన రాఘవయ్య ఆ భవనానికి వాస్తు సరిలేదని, అందువల్ల రాత్రిపూట అందులో బస చేయవద్దని చెప్పినట్లు తెలిసింది. అందువల్లే చంద్రబాబు ఇటీవలి కాలంలో విజయవాడలో రాత్రిపూట బసచేస్తే హోటళ్లలోనే ఉంటున్నారు. హైదరాబాద్‌లోని బాబు నివాసంతో పాటు ఎన్‌టీఆర్ భవన్‌లో కూడా రాఘవయ్య సూచనల మేరకే గతంలో మార్పులు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement