తెలివితక్కువ పనులు చేశా: సీఎం

20 Aug, 2017 09:45 IST|Sakshi
తెలివితక్కువ పనులు చేశా: సీఎం

పట్నా: అలీ అన్వర్‌ అన్సారీని రెండు సార్లు ఎంపీని చేసి తప్పుచేశానని జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) నాయకుడు, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ పరోక్షంగా వ్యాఖ్యానించారు. బిహార్‌ ప్రజలు ఒక కుటుంబానికి అనుకూలంగా ఓటు వేయలేదని లాలూ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. పట్నాలో శనివారం జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎన్డీయేలో చేరటంపై తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా నితీశ్‌ మాట్లాడుతూ.. 'ఒకాయన రాజ్యసభకు ఎన్నికకాగానే చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. 2012లో బీజేపీ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికైన ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూడండి. నా సహచరులు అన్నట్టు, కొన్ని సమయాల్లో నేను తెలివితక్కువ పనులు చేశానని నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఆయనను రెండుసార్లు రాజ్యసభకు పంపిస్తే ఇప్పుడు నాకే ఉపదేశాలు బోధిస్తున్నార'ని అన్సారీపై నితీశ్‌ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

లౌకికవాదంకు మద్దతుగా 2015లో బిహార్‌ ప్రజలు మహాకూటమిని గెలిపించారని శరద్‌ యాదవ్‌ వర్గం చేసిన చేసిన వ్యాఖ్యలపైనా నితీశ్‌ స్పందించారు. 'తమకు సేవ చేయాలని బిహార్‌ ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. అంతేకాని ఒక కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి కాద'ని నితీశ్‌ పేర్కొన్నారు. కాగా, అలీ అన్వర్‌ అన్సారీతో పాటు 21 మంది బిహార్‌ నాయకులను జేడీయూ ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించింది.

మరిన్ని వార్తలు