20 వేల కోట్ల హవాలా గుట్టు రట్టు

12 Feb, 2019 08:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు ఢిల్లీలో దాడులు, సర్వేలు చేసి రూ. 20 వేల కోట్ల మనీ లాండరింగ్‌ హవాలా రాకెట్ల గుట్టు రట్టు చేసినట్లు సోమవారం వెల్లడైంది. ఐటీ ఢిల్లీ దర్యాప్తు విభాగం అధికారులు గత కొన్ని వారాలుగా పాత ఢిల్లీలోని పలు చోట్ల ఈ సర్వేలు, దాడులు చేసినట్లు ఐటీ విభాగంలోని ఓ అధికారి వెల్లడించారు. మూడు ముఠాలు ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఈ దాడుల్లో బయటపడిందని చెప్పారు.

నయా బజార్‌ ప్రాంతంలో రూ. 18 వేల కోట్ల విలువైన నకిలీ బిల్లులును గుర్తించామనీ, ఈ బిల్లులను సృష్టించడం కోసం ఓ ముఠా 12 నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసిందని అధికారి తెలిపారు. ఇక రెండో ముఠా పూర్తి వ్యవస్థీకృతంగా మనీ లాండరింగ్‌కు పాల్పడిందనీ, షేర్‌ మార్కెట్లలో ప్రస్తుత లావాదేవీలను పాత షేర్ల అమ్మకాలుగా చూపించి క్యాపిటల్‌ గెయిన్స్‌ ప్రయోజనాలను పొందారని చెప్పారు. ఈ మోసం విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నామనీ, అయితే చాలా ఏళ్లుగా ఈ మోసం జరుగుతున్నందున ఇంకా భారీ మొత్తంలోనే అక్రమ లావాదేవీలు జరిగి ఉండొచ్చని అధికారి అనుమానం వ్యక్తం చేశారు.

మరో ముఠా రహస్యంగా విదేశీ బ్యాంకు ఖాతాలను కలిగి ఉడటంతోపాటు ఎగుమతుల వాస్తవ ధర కన్నా బిల్లుల్లో ఎక్కువ ధర చూపి నకిలీ డ్యూటీ, జీఎస్‌టీ ప్రయోజనాల పొందిందనీ, ఈ మోసం విలువ రూ. 1,500 కోట్లకు పైగా ఉంటుదని అధికారి తెలిపారు. సోదాల్లో సంతకాలు చేసిన, చేయని కొన్ని పత్రాలు, ఒప్పందాలు, ఆర్థిక వివాదాల పరిష్కార పత్రాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 

మరిన్ని వార్తలు