మాజీ డిప్యూటీ సీఎం ఇంట్లో ఐటీ సోదాలు

10 Oct, 2019 15:22 IST|Sakshi

న్యూఢిల్లీ: కర్నాటక మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర ఇంట్లో, ఆయన ట్రస్టుకు చెందిన మెడికల్‌ కళాశాలలో గురువారం ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. పరమేశ్వరకు సంబంధించిన 30 సంస్థలలో సోదాలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నిర్వహిస్తున్న మెడికల్‌ కళాశాల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలపై పరమేశ్వర స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలపై సోదాలు నిర్వహిస్తే తనకేమి అభ్యంతరం లేదని, అన్ని పత్రాలను సమర్పించడానికి సిద్ధమని ప్రకటించారు. ఇక.. మరో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు ఆర్‌.ఎల్‌ జలప్పకు చెందిన మెడికల్‌ ఆసుపత్రి, కళాశాలలో సైతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈ విషయంపై గురించి కర్నాటక మాజీ సీఎం సిద్దరామయ్య సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. కాంగ్రెస్‌ నాయకుల అవినీతిని నిరూపించడం చేతకానందునే రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగా.. ప్రభుత్వం తమ నాయకుల నివాసాలలో సోదాలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో గురువారం నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఐటీ సోదాలపై అధికార బీజేపీని కాంగ్రెస్‌ నిలదీసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు