చైనా సైబర్‌ దాడులను తిప్పికొట్టలేమా..?

9 Aug, 2017 19:56 IST|Sakshi
చైనా సైబర్‌ దాడులను తిప్పికొట్టలేమా..?

భారత కంపెనీలు, ప్రభుత్వ సంస్థలపై చైనా హ్యాకర్లు విరుచుకుపడితే దీటుగా ఎదుర్కొనేందుకు భారత్‌ సంసిద్ధంగా లేదని సైబర్‌ భద్రతా నిపుణులు రాహుల్‌ త్యాగి హెచ్చరించారు. ఈ తరహా దాడులకు ప్రభుత్వ సంస్థలు సులభంగా టార్గెట్‌ అవుతాయని, దురదృ‍ష్టవశాత్తూ ఈ దాడులను మనం గుర్తించగలిగే పరిస్థితిలో కూడా లేమని ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌తో మనకు సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో అక్కడి నుంచి సైబర్‌ దాడులు జరగుతున్నాయని భ్రమింపచేసేలా చైనా హ్యాకర్లు ఐపీలతో మాయాజాలం చేస్తారని అన్నారు.

ఐపీ అడ్రస్‌ ద్వారా ప్రతి కంప్యూటర్‌ను అది ఉపయోగించే ఇంటర్‌నెట్‌, దాని లొకేషన్‌ను గుర్తించవచ్చని, ఈ తరహా దాడులను పసిగట్టే సామర్ధ్యం మన ప్రభుత్వానికి లేదని ఎథికల్‌ హ్యాకర్‌ కూడా అయిన త్యాగి పేర్కొన్నారు. ఈ తరహా దాడులను దీటుగా ఎదుర్కొనేందుకు కొంత సమయం, నిధులను ప్రభుత్వం వెచ్చించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

సైబర్‌ దాడులను పసిగట్టి, నిరోధించేలా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. మరోవైపు యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ గుర్తించకుండా ఉండేలా హార్డ్‌వేర్‌లో మాల్‌వేర్‌(వైరస్‌)ను చైనా కంపెనీలు ప్రవేశపెట్టాయని గతంలో వార్తలు వచ్చాయి. భారత్‌ హార్డ్‌వేర్‌ కోసం అధికంగా చైనా దిగుమతులపైనే ఆధారపడటం కూడా ఆందోళన కలిగిస్తున్నది.

మరిన్ని వార్తలు