అవినీతిపై పోరు ఆగదు

6 Nov, 2017 01:07 IST|Sakshi

హిమాచల్‌ను ఐదు మాఫియాల నుంచి కాపాడాలి

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

కులూ/పలంపూర్‌: తన దిష్టిబొమ్మల్ని తగలబెట్టినంత మాత్రాన అవినీతి, నల్లధనంపై పోరు ఆగదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. నోట్ల రద్దుకు ఏడాది పూర్తయిన సందర్భంగా నవంబర్‌ 8న నిరసన ప్రదర్శనలు నిర్వహించాలన్న కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులూ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అప్పుడే నోట్ల రద్దు చేసి ఉంటే ఇప్పుడు తనకు ఆ నిర్ణయం తీసుకునే అవసరం వచ్చేది కాదన్నారు. నవంబర్‌ 9న ఎన్నికలు జరగనున్న హిమాచల్‌లో ఆదివారం సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ‘నోట్ల రద్దు అనంతరం 3 లక్షలకు పైగా నకిలీ కంపెనీలు మూతపడ్డాయి.

5 వేల కంపెనీలపై విచారణ కొనసాగించగా.. రూ. 4 వేల కోట్లకు పైగా మోసాలు వెలుగులోకి వచ్చాయి. మిగతా కంపెనీలపై విచారణ కొనసాగుతోంది. 3 లక్షల కంపెనీలు ఎంత భారీ మోసానికి పాల్పడి ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. కొన్ని కంపెనీలు కార్యాలయాల్లో కేవలం రెండు కుర్చీలు, ఒక టేబుల్‌ పెట్టుకుని కోట్లాది రూపాయల నల్లధనాన్ని మార్పిడి చేశాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. నోట్ల రద్దు ప్రభావంతో కాంగ్రెస్‌ ఇంకా ఇబ్బంది పడుతోందని, నిరసన ప్రదర్శనలకు ఆ పార్టీ పిలుపునివ్వడానికి కారణం అదేనని మోదీ చెప్పారు. ‘నోట్లరద్దుతో నష్టపోయిన కొందరు ఇప్పటికీ ఫిర్యాదు చేస్తున్నారు. నవంబర్‌ 8న బ్లాక్‌ డే గా జరపాలని నిర్ణయించారు. సంతాపంగా పాటించాలని కాంగ్రెస్‌ పార్టీ ఆలోచన చేస్తోంది. రాబోయే రోజుల్లో బాధపడడం తప్ప వారు చేసేదేమీ ఉండదు. దిష్టిబొమ్మలు తగలబెడితే నేను భయపడేది లేదు. అవినీతికి వ్యతిరేకంగా పోరు ఆగదు’ అని పలంపూర్‌ ర్యాలీలో మోదీ స్పష్టం చేశారు.  

పోరు నుంచి కాంగ్రెస్‌ పలాయనం
హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల పోరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ పారిపోయిందని మోదీ ఎద్దేవా చేశారు. ఉనా ఎన్నికల సభలో ఆయన ప్రసంగిస్తూ... ‘నిజానికి హిమాచల్‌ ఎన్నికల పట్ల నాకు ఆసక్తిగా లేదు. ఎందుకంటే పోరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ వైదొలగడంతో ఈ ఎన్నికలు ఏకపక్షంగా మారాయి. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెపుతారు’ అని అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న తనకు హిమాచల్‌ గాలి ఎటువైపు వీస్తుందో తెలుసని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే హిమాచల్‌ను అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. రాష్ట్రాన్ని మైనింగ్, అటవీ, డ్రగ్, టెండర్, ట్రాన్స్‌ఫర్‌ మాఫియాల నుంచి కాపాడాల్సిన అవసరముందన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కేంద్రంలో రూ. 57 వేల కోట్ల సబ్సిడీలు దుర్వినియోగమయ్యాయని, తాను అధికారంలోకి వచ్చాక అవినీతిని అడ్డుకుని, పేదలకు సబ్సిడీలు అందేలా చేశానని మోదీ చెప్పారు. ‘కేంద్రం రూపాయి ఖర్చు చేస్తే కేవలం 15 పైసలు  ప్రజలకు చేరుతుందని మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ చెప్పారు. నిజానికి కాంగ్రెస్‌ పార్టీ చేసిన దాన్నే ఆయన చెప్పారు. సమస్యను గుర్తించినా దానికి రాజీవ్‌ పరిష్కారం చూపలేదు’ అని  ప్రధాని పేర్కొన్నారు.   

ఇందిరా గాంధీ నోట్ల రద్దు చేసి ఉంటే
నోట్ల రద్దు కాంగ్రెస్‌కు నిద్ర లేకుండా చేసిందని, అందుకే ఆ పార్టీ కోపం ఇంకా చల్లారలేదని మోదీ విమర్శించారు. ‘అప్పట్లో యశ్వంత్‌రావు  నేతృత్వంలోని కమిటీ నోట్ల రద్దుకు సిఫార్సు చేసినా ఇందిరా నిరాకరించారు. దేశం కంటే పార్టీ ఆసక్తులకే ప్రాధాన్యమిచ్చారు. పార్టీ కంటే దేశం ముఖ్యమని కాంగ్రెస్‌ భావించలేదు’ అని అన్నారు. కాంగ్రెస్, అవినీతికి మధ్య సంబంధం విడదీయలేనిదని.. ఒక చెట్టుకు, వేరుకున్న సంబంధంలాంటిదన్నారు. ‘కాంగ్రెస్‌ నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్‌పై బయట ఉన్నారు. ఇప్పుడేమో అవినీతిని అడ్డుకుంటామని మాటలు చెపుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకున్న గుర్తింపు అవినీతి మాత్రమే’ అని అన్నారు. బినామీ ఆస్తులకు చెక్‌ పెట్టేందుకు చట్టం తీసుకొచ్చేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలతో కాంగ్రెస్‌ భయపడుతోందని, అధికారంలో ఉండగా ఆ పార్టీ చట్టం తేవడంలో విఫలమైందని ప్రధాని తప్పుపట్టారు.

మరిన్ని వార్తలు