నిమిషానికి 7 వేల టికెట్లు

14 Aug, 2014 02:54 IST|Sakshi
నిమిషానికి 7 వేల టికెట్లు

ఢిల్లీలో ఈ టికెటింగ్ వ్యవస్థను ప్రారంభించిన సదానంద గౌడ
 
న్యూఢిలీ: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌లో ఎదురయ్యే ఇబ్బందులను పూర్తిగా తొలగిస్తూ రూపొందించిన అధునాతన ఈ టికెటింగ్ వ్యవస్థకు రైల్వే శాఖ బుధవారం శ్రీకారం చుట్టింది. పాత పద్ధతిలో నిమిషానికి 2,000 టికెట్లు బుక్‌చేయడానికి వీలుండగా, ఈ కొత్త వ్యవస్థద్వారా నిమిషానికి 7,200 టికెట్లు బుక్‌చేయవచ్చు. మొత్తం బుకింగ్ ప్రక్రియ వేగంగా, సులభతరంగా ఉండేలా ఈ వ్యవస్థను రూపొందించారు. కొత్త తరహా ఈ టికెటింగ్ వ్యవస్థను రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ఢిల్లీలో ప్రారంభించారు.

రైల్వే బడ్జెట్‌లో హామీ ఇచ్చిన ప్రకారం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం (సీఆర్‌ఐఎస్) రూ. 180 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ వ్యవస్థను రూపొందించిందన్నారు. కొత్త పద్ధితిలో ఒకేసారి లక్షా 20వేలమంది టికెట్లు బుక్‌చేయడానికి వీలవుతుందన్నారు. ఇదివరకైతే ఒకేసారి 40వేల మంది మాత్రమే టికెట్లు బుకింగ్ చేయడానికి వీలుండేది.

గో ఇండియా స్మార్ట్ కార్డ్

ఈ టికెటింగ్ వ్యవస్థతోపాటుగా, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ట్రెయిన్ ఎంక్వయిరీ మొబైల్ అప్లికేషన్, గో ఇండియా స్మార్ట్ కార్డ్ వ్యవస్థలను కూడా మంత్రి ప్రారంభించారు. టికెట్ బుకింగ్ కౌంటర్లలో టికెట్ జారీ వ్యవధి తగ్గించేందుకు గో ఇండియా స్మార్ట్ కార్డ్ పద్ధతిని మంత్రి ప్రారంభించారు. ప్రయాణికులు రిజర్వ్‌డ్, అన్ రిజర్వ్‌డ్ తరగతులతో సహా, సబర్బన్ సర్వీసుల టికెట్లకు కూడా స్మార్ట్ కార్డు ద్వారా చెల్లింపులు జరపవచ్చు. లైఫ్‌టైమ్ వాలిడిటీ ఉండే స్మార్ట్ కార్డ్‌ను రూ. 70చెల్లింపుపై జారీచేస్తారు. దాన్ని  10వేల రూపాయల గరిష్టస్థాయి వరకూ రీచార్జ్ చేసుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు