నేడు అయోధ్యలో 51 ఘాట్లలో 24 లక్షల దీప కాంతులు!

11 Nov, 2023 10:31 IST|Sakshi

అయోధ్యలో దీపావళిని మరింత దేదీప్యమానం చేసేందుకు ఈసారి కూడా రామనగరిని అందంగా ముస్తాబు చేస్తున్నారు.  అయోధ్యలోని 51 ఘాట్‌లలో నవంబరు 11న(నేడు) 24 లక్షల దీపాలు వెలిగించి, సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ‍ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 6 సంవత్సరాలుగా అయోధ్యలో జరుగుతున్న దీపోత్సవం ప్రపంచ రికార్డులను సృష్టిస్తోంది. ఈ సంప్రదాయం ఈసారి కూడా కొనసాగనుంది. 

దీపావళి సందర్భంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున లేజర్ షో ద్వారా శ్రీరాముని జీవిత సంగ్రహావలోకనాన్ని  ప్రదర్శించనున్నారు. మనదేశానికి చెందిన కళాకారులతో పాటు రష్యా, శ్రీలంక, సింగపూర్‌, నేపాల్‌కు చెందిన కళాకారులు  కూడా ఈ దీపోత్సవ్‌లో రామలీలను ప్రదర్శించనున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దీపావళి నాడు అయోధ్యలో త్రేతాయుగం కళ్లకు కట్టినట్లు చూపేందుకు కళాకారులు సన్నద్ధమవుతున్నారు.  

రామ మందిర నిర్మాణం పూర్తవుతున్న తరుణంలో ఈసారి అయోధ్యలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి. ఈసారి యూపీతో పాటు పలు రాష్ట్రాల సంస్కృతులను ప్రదర్శనల్లో చూపనున్నారు. ఇప్పటికే అయోధ్యానగరి దీప కాంతులతో మెరిసిపోతోంది. రోడ్లు, ఇళ్లు, వీధులు జనాలతో రద్దీగా మారిపోయాయి.  కాగా అయోధ్యలో జనవరి 22న రామాలయంలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఇందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి:  ‘సరి- బేసి’తో ఎంత ప్రయోజనం? గతంలో ఏం తేలింది?
 

మరిన్ని వార్తలు