బాస్‌గా కూతురు; ఇంటికి త్వరగా వెళ్లండి!

10 May, 2019 14:47 IST|Sakshi

‘ అసలు ఈ ఆనందాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు. ఈ రోజు తను బాస్‌. నా కంటే ఉన్నత స్థానంలో ఉన్న అధికారి. ఇంటికి త్వరగా వెళ్లాలని ఆదేశించింది. ఈరోజు నేను కచ్చితంగా తన ఆదేశాలు శిరసా వహిస్తా’ అంటూ ఓ పోలీసు తండ్రి పుత్రికోత్సాహంతో పొంగిపోయారు. ఐసీఎస్‌సీ క్లాస్‌ 10, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో కోల్‌కతాకు చెందిన రిచా సింగ్‌ 99.25 శాతం మార్కులు సాధించి దేశం మొత్తంలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈమె తండ్రి రాజేష్‌ సింగ్‌ పోలీసు అధికారి. గరియాహట్‌ పోలీస్‌ స్టేషనులో అదనపు ఇంచార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేష్‌ సింగ్‌ కూతురు విజయాన్ని సెలబ్రేట్‌ చేస్తూ కోల్‌కతా పోలీసులు ఆమెను సత్కరించారు.

ఇందులో భాగంగా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సిటీ ఆగ్నేయ డివిజన్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉండేందుకు రిచాకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా సబార్డినేట్‌ అయిన తండ్రికి బాస్‌గా ఎటువంటి ఆదేశాలు జారీ చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా..‘  ఇంటికి త్వరగా వెళ్లాలని ఆయనను ఆదేశిస్తా’ అంటూ సమాధానమిచ్చింది. దీంతో ఒక్కరోజైనా తండ్రి ఇంటికి త్వరగా రావాలనే ఆమె కోరిక విని రాజేష్‌ సింగ్‌ భావోద్వేగానికి గురయ్యారు. డ్యూటీలో ఉండి కూతురితో సమయం కేటాయించలేని ఆయన లాంటి పోలీసు తండ్రులకు ‘బాస్‌’ కల్పించిన ఈ అవకాశం ఎంతో ఆనందాన్నిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా!

మరిన్ని వార్తలు