Video: ప్లేయింగ్‌ కార్డ్స్‌తో వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు..

7 Oct, 2023 12:55 IST|Sakshi

కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చంటారు. కష్టపడేతత్వం ఉంటే  ఎంతటి లక్ష్యాలను అయినా సాధించగలం. అందుకు తగ్గట్టు పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధించగలం. అందుకు 15 ఏళ్ల బాలుడు నిదర్శనంగా నిలిచాడు. తన అసాధారణ ప్రతిభతో ఏకంగా వరల్డ్‌ రికార్డునే కొల్లగొట్టాడు.

కోల్‌కతాకు చెందిన అర్నవ్‌ దగ అనే 15 ఏళ్ల బాలుడు ప్లేయింగ్‌ కార్డ్స్‌ను ఉపయోగించి భారీ నిర్మాణాన్ని చేపట్టాడు. 1.43 లక్షల ప్లేయింగ్‌ కార్డ్స్‌ను ఉపయోగించి.. కోల్‌కతాలోని ప్రఖ్యాతిగాంచిన రచయితల భవనం, షామిద్‌ మినార్‌, సాల్ట్‌ లేక్‌ స్టేడియం, సెయింట్‌ పాల్‌ కేథడ్రల్‌లను నిర్మించి రికార్డు సృష్టించాడు. కేవలం 41 రోజుల్లోనే ఎలాంటి టేపు, గమ్‌ సాయం లేకుండా ఈ నాలుగు నిర్మాణాలను పూర్తిచేయడం విశేషం. దీని  పొడవు 40 అడుగులు కాగా, ఎత్తు 11 అడుగుల 4 అంగుళాలు. వెడల్పు 16 అడుగుల 8 అంగుళాలతో  ప్రాజెక్టును నిర్మించాడు.

దీంతో అర్నవ్‌ రూపొందిన ఈ కట్టడం గతంలో బ్రయాన్‌ బెర్గ్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడుతూ.‌. ప్రపంచంలోనే అతిపెద్ద ప్లేయింగ్‌ కార్డ్స్‌ నిర్మాణం’గా రికార్డుకెక్కింది. ఈ విషయాన్ని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ తమ ఎక్స్‌(ట్విటర్‌) ద్వారా వెల్లడించింది. బ్రయాన్‌బెర్గ్‌ మూడో హోటళ్లను 34 అడుగుల 1 అంగుళం పొడవుతో, 9 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 11 అడుగుల 7 అంగుళాల వెడల్పుతో నిర్మించాడు .

తన ప్రాజెక్ట్ గురించి అర్నవ్‌ మాట్లాడుతూ.. ప్లేయింగ్‌ కార్డ్స్‌తో నిర్మాణాన్ని చేపట్టేందుముందు నాలుగు ప్రఖ్యాతి ప్రదేశాలను సందర్శించినట్లు తెలిపాడు. వాటి నిర్మాణం, పని, ఆర్కిటెక్చర్ అన్నీంటిని అధ్యయం  చేసినట్లు చెప్పాడు.‘ఎనిమిదేళ్ల వయసులోనే ప్లేయింగ్‌ కార్డ్స్‌తో చిన్న చిన్న మేడలు కట్టడం మొదలుపెట్టానని తెలిపాడు. లాక్‌డౌన్‌ సమయంలో దీనిపై మరింత కసరత్తు చేశా. దీంతో మూడేళ్లు శ్రమించి గిన్నిస్‌ రికార్డులో స్థానం సంపాధింనని అర్నవ్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు