తీహార్‌ జైలుకు వెళ్లాలనుకుంటున్నారా..!

10 Oct, 2019 13:25 IST|Sakshi
తిహార్‌ జైలు

న్యూఢిల్లీ: జైలు జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. కారాగారంలో ఖైదీల జీవనం ఎలా ఉంటుంది? కరుడుగట్టిన తీవ్రవాదులు జైలులో ఎలా ఉంటారు?  వీటన్నింటినీ తెలుసుకోవడంతోపాటు నేరగాళ్లను ప్రత్యేక్షంగా చూడటానికి ఆసియాలోనే అతిపెద్దదైన తీహార్‌ జైలు సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. ‘తీహార్‌ టూరిజం’ పేరుతో జైలు చూడాలనే ఆసక్తి ఉన్న సందర్శకులకు అనుమతి ఇవ్వనుంది. దీంతో సందర్శకులు జైలులో ఉండే ఖైదీలను, వారు రోజువారిగా చేసే పనులను, జైలు పరిసరాలను ప్రత్యక్షంగా చూడవచ్చని తీహార్‌ జైలు అధికారులు తెలిపారు. 

జైలును సందర్శించి,అక్కడే ఒక రోజుకు పాటు ఖైదీలతో ఉండాలనే ఆసక్తి ఉన్న సందర్శకులకు రూ.500 సాధారణ ఫీజుతో అనుమతి ఇ‍వ్వడానికి కారాగార ఉన్నతాధికారులు నియమ నిబంధనలను రూపొందిస్తున్నారు. ‘సందర్శకులు జైల్లో ఇతర ఖైదీలు ఉన్నట్టుగానే సాధారణంగా ఒక రోజు వారితో జైలు గదిలో ఉండాలి. నేలపైనే నిద్రించాలి. ఉదయాన్నే లేచి వంట చేసుకోవాలి. తమ ప్రాంగణాన్ని శుభ్రపరచాలి. యోగా, ధ్యానం, పెయింటింగ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. సందర్శకులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జైలు లోపలికి సెల్‌ఫోన్‌లను అనుమతించబోమని’ తీహార్‌ జైలు ఉన్నతాధికారి తెలిపారు. 

కాగా ఖైదీల ప్రవర్తన ఆధారంగా మంచి వారిని మాత్రమే సందర్శకులతో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అదే విధంగా ఖైదీలకు ఎటువంటి ఇబ్బందులు కలించరనే నమ్మకం ఉన్న సందర్శకులకు మాత్రమే జైలును సందర్శించే అనుమతి కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో 16వేల మంది ఖైదీలున్న తీహార్‌ జైలు దేశంలో ఉన్నపెద్ద కారాగారం అన్న విషయం తెలిసిందే. ఇటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో ‘ఫీల్‌ ద జైల్‌’ పేరుతో కారాగాన్ని సందర్శించి అక్కడే ఒక రోజుపాటు ఖైదీలతో ఉండే అవకాశాన్ని జైలు ఉన్నతాధికారులు కల్పిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు