విషమంగా ఢిల్లీ గాలి కాలుష్యం!

17 Nov, 2023 11:42 IST|Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని పరిసర ప్రాంతాలలో గాలి నాణ్యత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఢిల్లీ నగరాన్ని విషపూరిత పొగ దట్టంగా కప్పేసింది. గాలి నాణ్యతా సూచీ(AQI) శుక్రవారం ఉదయం అత్యధికంగా 404గా నమోదైంది. నెమ్మదిగా వీస్తున్న గాలులు, తక్కువ ఉష్ణోగ్రతలు కాలుష్య కారకాలు పేరుకుపోయే వాతావరణాన్ని సృష్టించాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని వెల్లడించింది.  

ఢిల్లీలో గురువారం గాలి నాణ్యతా సూచీ 419గా నమోదైంది. బుధవారం 401గా ఉన్న నాణ్యతా ప్రమాణాలు.. మంగళవారం 397, సోమవారం 358, ఆదివారం 218, శనివారం 220గా ఉన్నాయి. రోజురోజుకీ గాలి నాణ్యత మరింత దిగజారుతోందని  ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. వాహనాల ఉద్గారాలతో పాటు దీపావళి వేడుకలు పరిస్థితుల్ని మరింత తీవ్రతరం చేశాయి.

ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం గురువారం స్పెషల్ టాక్స్ ఫోర్స్‌ను  ఏర్పాటు చేసింది. అటు.. గాలి నాణ్యతను పెంచడానికి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన రెండు స్మోగ్ టవర్లు కాలుష్యాన్ని తగ్గించలేకపోయాయని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి తెలిపింది. అంతేకాకుండా వాటి నిర్వహణకు ఖర్చు అధికంగా అవుతుందని పేర్కొంది. 

కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు. ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని స్థానికులు వాపోయారు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని అంటున్నారు. రోడ్డుపైకి వెళ్తే పొగతో దారి కనిపించే పరిస్థితులు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: హర్యానా నూహ్‌లో మళ్లీ ఉద్రిక్తత

మరిన్ని వార్తలు