100 కోట్లు, మూడేళ్ల కూతుర్ని వదులుకుని..

16 Sep, 2017 15:10 IST|Sakshi
100 కోట్లు, మూడేళ్ల కూతుర్ని వదులుకుని..

సాక్షి, భోపాల్ : డబ్బుంటేనే తమ సమస్యలు తీరుతాయి అనుకునేవారు కొందరు. కోట్ల ఆస్తిని వదిలేసినా ఏ సమస్యా లేకుండా జీవించవచ్చునని నమ్మేవారు మరికొందరు. మధ్యప్రదేశ్‌కు చెందిన దంపతులు రెండో కోవకే చెందుతారు. కానీ జైన్ వర్గానికి చెందిన భార్యాభర్తలు తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ వివరాలిలా ఉన్నాయి..

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని నీమ‌చ్ కు సుమీత్ రాథోడ్(35), అనామిక(34) లకు రూ.100 కోట్లకు పైగా ఆస్తి ఉంది. వీరికి మూడేళ్ల పాప సంతానం. అయితే వీరు వందకోట్ల ఆస్తితో పాటు తమ మూడేళ్ల చిన్నారిని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కారణం కొన్ని రోజుల్లో వీరు సన్యాసం స్వీకరించనున్నారు. గుజరాత్ లోని సూరత్‌కు చెందిన సుధామార్గి ఆచార్య రామ్‌లాల్ మహరాజ్ కింద వీరు శిష్యులుగా ఉండనున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

సెప్టెంబర్ 23న ఇందుకు తాము తొలి అడుగు వేయనున్నట్లు సుమీత్ దంపతులు చెబుతున్నారు. మూడేళ్ల కూతురు ఐభ్య పరిస్థితి ఏమౌతుందో ఆలోచించుకోవాలని, ఆధ్యాత్మికత వైపునకు వెళ్లాలనుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని బంధువులతో పాటు వీరి స్నేహితులు, స్థానికులు చెప్పిచూసినా లాభం లేకపోయింది. 100 కోట్ల ఆస్తిని, మూడేళ్ల పాపను వద్దనుకుని.. మీరు ఏం పనిచేస్తున్నారో అర్థమవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ వ్యాపారి, సిమెంట్ ఫ్యాక్టరీల అధినేత అయిన సుమీత్ తండ్రి రాజేంద్ర సింగ్ రాథోడ్ వీరి నిర్ణయానికి మద్ధతు తెలిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గత ఆగస్టు 22న సుమీత్ తాను ఆధ్యాత్మికత దిశగా వెళ్తున్నానని చెప్పగా భార్య అనామిక తాను కూడా వెంట ఉంటానని భర్త దారినే ఎంచుకున్నారు.

మరిన్ని వార్తలు