కోర్టుకు హాజరైన ముఖ్యమంత్రి

10 Apr, 2017 17:42 IST|Sakshi
కోర్టుకు హాజరైన ముఖ్యమంత్రి

ఏవైనా కేసులు నమోదైతే చాలు.. వాటికి వెంటనే బెయిల్‌ తెచ్చుకోవడం, కోర్టు మెట్లు ఎక్కకుండా జాగ్రత్తగా తప్పించుకోవడం కొందరు ముఖ్యమంత్రులకు ఉన్న అలవాటు. కానీ జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘువర్‌ దాస్‌ మాత్రం అలా చేయలేదు. 2009 నాటి లోక్‌సభ ఎన్నికల సమయంలో కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఆయన స్వయంగా ఓ స్థానిక కోర్టుకు హాజరయ్యారు. ఇదే కేసులో ఉన్న మరో సహ నిందితుడితో కలిసి ఆయన చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్ఘేట్‌ జీకే తివారీ ఎదుట హాజరయ్యారు. బిస్తుపూర్‌ సమీపంలో జిల్లా అధికార యంత్రాంగం నుంచి ముందస్తు అనుమతి లేకుండా దాస్‌తో పాటు మరో 12 మంది బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ జెండాలను ఎగరేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితులందరి వాంగ్మూలాలను నమోదు చేసిన కోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్‌ 15వ తేదీకి వాయిదా వేసింది.

మరో కేసులో కూడా సీఎం రఘువర్‌ దాస్‌, మరో 22 మంది నిందితులు కలిసి 2007లో నమోదైన కేసు విచారణకు సబ్‌ డివిజనల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ అశోక్‌కుమార్‌ ఎదుట హాజరయ‍్యారు. అధికారుల అనుమతి లేకుండా ఓ ఆలయానికి ప్రహరీ నిర్మించిన కేసులో అరెస్టయిన నిందితులను బలవంతంగా తీసుకెళ్లిపోయినట్లు దాస్‌, 22 మంది బీజేపీ కార్యకర్తలతో పాటు 500 మంది గుర్తు తెలియని వ్యక్తుల మీద కేసు నమోదైంది. ఈ కేసులో కూడా దాస్‌ చెప్పిన విషయాలను నమోదు చేసిన కోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్‌ 25కు వాయిదా వేసింది. ఈ రెండు కేసులలోనూ తాను నిర్దోషినని, నాటి అధికార పార్టీలు తనను తప్పుడు కేసుల్లో ఇరికించాయని దాస్‌ అన్నారు.

మరిన్ని వార్తలు