ఒక పౌరునిలా అలా అన్నా: కుమారస్వామి 

26 Dec, 2018 04:01 IST|Sakshi

మండ్య: జేడీఎస్‌ నాయకుడిని చంపేసిన దుండగులను వెంటనే కాల్చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘జేడీఎస్‌ నేత ప్రకాశ్‌ను చంపేశారని తెలియగానే ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి, ఆవేశానికి గురయ్యాను. అందుకే కాల్చేయాలని ఆవేశంగా అన్నాను’ అని కుమారస్వామి వివరణ ఇచ్చారు.  సీఎం హోదాలో కాకుండా సాధారణ పౌరుడిలా ఆవేశంతో అలా స్పందించానని చెప్పారు.

మంగళవారం ఆయన మండ్య జిల్లా మద్దూరు తాలూకాలో హత్యకు గురైన నేత కుటుంబాన్ని పరామర్శించారు. హత్యకు గురైన ప్రకాశ్‌ తనకు ఆప్తుడంటూ కుమారస్వామి కంటతడి పెట్టుకున్నారు. కాగా, హత్యకు కారకులని ఆరోపిస్తూ తుప్పనహళ్లిలో కాంగ్రెస్‌ కార్యకర్తల ఇళ్లపై జేడీఎస్‌ కార్యకర్తలు దాడులు చేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. కాగా, ముఖ్యమంత్రికి మతిభ్రమించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. 

మరిన్ని వార్తలు