వారం తర్వాత ఇంటికి

6 Oct, 2014 22:31 IST|Sakshi

 న్యూఢిల్లీ: అటు పోలీసు శాఖ అధికారులతోపాటు కుటుంబసభ్యులను తీవ్ర గందరగోళానికి గురిచేసిన చిన్నారి జాహ్నవి ఆహుజా ఆదివారం రోజుల తర్వాత ఇంటికి చేరుకుంది. దీంతో జాహ్నవి కుటుంబసభ్యుల ఆనందానికి అంతేలేకుండాపోయింది. ఈ విషయమై జాహ్నవి తండ్రి రాజేశ్ ఆహుజా సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘ఇంటికొచ్చిన వెంటనే అందరినీ గమనించిన జాహ్నవి నాన్నా అంటూ నన్ను పిలిచింది. ఏడవడం ప్రారంభించింది.

ఆ తరువాత ఓ అడుగు ముందుకేసి నా ఒడిలో వాలిపోయింది. మాకు ఒకటే అమ్మాయి. దానికి ఫ్రూటీ అంటే ఎంతో ఇష్టం. ఇంటిలోకి రాగానే తింటానికి ఏదో ఒకటి ఇచ్చా’ అని అన్నాడు. ప్రస్తుతం తిండి బాగానే తింటోందని, బాగానే ఆడుకుంటోందని, రాత్రి బాగా నిద్రపోయిందన్నాడు. కాగా జాతీయ రాజధాని నడిబొడ్డునగల ఇండియా గేట్ వద్ద జాహ్నవి వారం క్రితం తప్పిపోయిన సంగతి విదితమే. జాహ్నవిని వెంటబెట్టుకుని ఆదివారం సాయంత్రం సరదాగా కుటుంబసభ్యులంతా ఇండియాగేట్ వద్దకు వచ్చారు. అయితే రాత్రి తొమ్మిది గంటల సమయంలో జాహ్నవి కనిపించలేదు.

 దీంతో కుటుంబసభ్యులు తిలక్‌మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అనంతరం నగర పోలీసు విభాగం సిబ్బందితోపాటు క్రైంబ్రాంచ్, స్పెషల్ సెల్‌కుచెందిన బృందాలు  జాహ్నవి ఆచూకీ కోసం గాలింపు చర్యలను చేపట్టిన సంగతి విదితమే.  ఇండియాగేట్ వద్ద తప్పిపోయిన మూడేళ్ల పసిపాప జాహ్నవి ఆచూకీ కనుగొన్నవారికి రూ. 50 వేల నగదు బహుమతిని అందజేస్తామంటూ నగర పోలీస్ కమిషనర్ భీంసేన్ బసి ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే.

 కాగా ఆదివారం సాయంత్రం జాహ్నవి నగరంలోని మాయాపురి పోలీస్‌స్టేషన్ సమీపంలో ధీరేందర్ అనే ఓ కళాశాల విద్యార్థి కంటపడింది. ఆ సమయంలో పాప మెడలో ఆమె పేరుతోపాటు ఓ ఫోన్ నంబర్ ఉండడాన్ని గమనించిన ఆ విద్యార్థి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు జాహ్నవిని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.

 నిందితులింకా పరారీలోనే...
 జాహ్నవిని అపహరించిన వ్యక్తులు ఇప్పటి కీ పరారీలోనే ఉన్నారు. అపహరణ అనంతర పరిణామాల క్రమాన్ని గుర్తించేందుకు యత్నిస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. ఇంటికొచ్చే సమయానికి జాహ్నవి ఒంటిపై గల్లంతైన సమయంలో ధరించిన దుస్తులే ఉన్నాయి. నిందితులు జాహ్నవిని మురికిప్రదేశంలో ఉంచలేదని, కొట్టడం వంటివి చేయలేదని, పాపశరీరంపై ఎటువంటి గాయాలూ కనిపించలేదని ఆయన వివరించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా