Covid-19 JN.1 Variant: మళ్లీ కోరలు చాస్తున్న కరోనా..!

25 Dec, 2023 06:15 IST|Sakshi

656 పాజిటివ్‌ కేసులు నమోదు

వ్యాధి విస్తృతిపై ఓ కన్నేయండి

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

న్యూఢిల్లీ: కరోనా కేసుల ఉధృతి నెమ్మదిగా ఊపందుకుంటోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 656 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,742కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది.

కేరళలో మరో వ్యక్తి కోవిడ్‌తో కన్నుమూయడంతో దేశంలో ఇప్పటిదాకా కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 5,33,333కి ఎగబాకింది. భారత్‌లో తొలికేసు వెలుగుచూసిననాటి నుంచి ఇప్పటిదాకా 4,50,08,620 మందికి కరోనా సోకగా వారిలో 4,44,71,545 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ పూర్తయింది.  

ఆగ్నేయాసియా దేశాలు జాగ్రత్త
శ్వాససంబంధ కేసులు ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. కోవిడ్‌ వ్యాధి విస్తృతిపై ఓ కన్నేసి, నిఘా పెంచి, వ్యాప్తి కట్టడికి కృషిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంత డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ ఆగ్నేయాసియా దేశాలకు సూచించారు. ‘‘ పండుగల సీజన్‌ కావడంతో జనం ఒక్కచోట గుమిగూడే సందర్భాలు పెరుగుతున్నాయి.

దీంతో కరోనా వ్యాప్తి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి’’ అని ఆమె చెప్పారు. జేఎన్‌1 ఉపవేరియంట్‌కు వేగంగా సంక్రమించే గుణం ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టంచేయడం తెల్సిందే. ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవిడ్‌ వ్యాక్సిన్లు జేఎన్‌1సహా అన్నివేరియంట్ల కరోనా వైరస్‌ల నుంచీ సమర్థవంతంగా రక్షణ కలి్పస్తాయి’’ అని ఆమె చెప్పారు.  ముందస్తు చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం సైతం అవసరమైన చోట్ల కోవిడ్‌ నిబంధనలను తప్పక అవలంభించాలని రాష్ట్రాలకు ఇప్పటికే సూచించింది.

>
మరిన్ని వార్తలు