కేంద్ర మంత్రికి నల్లజెండాలతో జేఎంఎం నిరసన

24 Aug, 2014 03:27 IST|Sakshi
కేంద్ర మంత్రికి నల్లజెండాలతో జేఎంఎం నిరసన

రాంచీ: ప్రధాని సమక్షంలో తమ నేతకు జరిగిన అవమానానికి నిరసనగా జేఎంఎం కార్యకర్తలు అన్నంత పని చేశారు. శనివారం జార్ఖండ్‌లో పర్యటిస్తున్న కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు రెండు సార్లు నల్లజెండాలు చూపి నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎదుటే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని క్షమాపణలు చెప్పే వరకు రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులకు నిరసన తెలుపుతూనే ఉంటామని జేఎంఎం నేతలు ఇప్పటికే ప్రకటించారు.
 
 ఈ నేపథ్యంలో శనివారం రాంచీ విమానాశ్రయం చేరుకున్న కేంద్ర మంత్రి తోమర్ ఎదుట నిరసన తెలిపారు. తన కాన్వాయ్‌లో వెళుతున్న తోమర్‌కు జేఎంఎం కార్యకర్తలు నల్లజెండాలు చూపారు. తర్వాత జంషెడ్‌పూర్‌లోనూ ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమ వేదిక వెలుపల కూడా ఇదే పని చేశారు. కాగా, రాంచీ విమానాశ్రయం వద్ద బీజేపీ, జేఎంఎం కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ కూడా జరిగింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. నిజానికి తోమర్ ఎదుట నిరసన తెలిపేందుకు జేఎంఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలోనే విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం షెడ్యూల్ కంటే గంట ఆలస్యంగా రావడంతో అప్పటికే చాలా మంది కార్యకర్తలు అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తే ప్రమాదం తప్పిందని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు