జర్నలిస్టులూ.. సీఎంకు కొంచెం దూరంగా ఉండండమ్మా..!

15 Nov, 2017 15:24 IST|Sakshi

న్యూఢిల్లీ: జర్నలిస్టులు ప్రతిసారీ ముఖ్యమంత్రిని చుట్టుముట్టి.. ఆయనకు అత్యంత దగ్గరగా వస్తున్నారు. కెమెరాలు, మైక్రోఫోన్లు సీఎంకు ఇలా దగ్గరగా తీసుకురావడం భద్రత్రాపరంగా ముప్పే. కాబట్టి జర్నలిస్టులు ముఖ్యమంత్రికి తగినంత దూరం పాటించాలంటూ సోనిపట్‌ జిల్లా అధికార యంత్రాంగం ఒక నోటిఫికేషన్ జారీచేసింది. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మీడియాతో మాట్లాడేటప్పుడు.. జర్నలిస్టులు, కెమెరామేన్‌ ఆయనకు కొంత దూరంగా ఉండాలని సూచించింది.

సీఎం ఖట్టర్‌ మీడియాతో మాట్లాడేటప్పుడు లేదా, ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగేటప్పుడు.. జర్నలిస్టులు అత్యంత చేరువగా వస్తున్నారని, దీంతో ఈ సమయంలో సీఎంకు రక్షణ కల్పించడం భద్రతా సిబ్బందికి కష్టంగా మారుతోందని ఈ నోటిఫికేషన్‌లో అధికారులు పేర్కొన్నారు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ లేదా, సీఎం బైట్‌ తీసుకునే సమయంలో జర్నలిస్టులు, కెమెరామేన్‌ మైకులు, కెమెరాలతో ఖట్టర్‌కు అత్యంత చేరువుగా వస్తున్నారని, భద్రతాపరంగా ఇలా రావడం సరికాదని తెలిపారు. కాబట్టి ఇకనైన సీఎం ఖట్టర్‌కు తగినంత దూరంలో ఉండి మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడాలని, భద్రతా విషయంలో రాజీపడబోమని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు