మెత్తబడ్డ ప్రభుత్వ వైద్యులు

17 Jun, 2019 04:12 IST|Sakshi
బికనీర్‌లో కొవ్వొత్తులతో వైద్యుల ర్యాలీ

బహిరంగ చర్చ ఏర్పాటు చేయాలని షరతు

అంగీకరించిన మమతా బెనర్జీ

న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో గత 6 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వ వైద్యులు, జూనియర్‌ డాక్టర్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చల విషయంలో ఆదివారం కాస్త మెత్తబడ్డారు. చర్చలు ఎక్కడ నిర్వహించాలన్న విషయమై తుది నిర్ణయాన్ని మమతా బెనర్జీకే వదిలిపెట్టామని వైద్యులు తెలిపారు. అయితే ఈ చర్చావేదిక మీడియా సమక్షంలో బహిరంగంగా ఉండాలనీ, గదిలో ఉండకూడదని షరతు విధించారు. కోల్‌కతాలో ఆదివారం దాదాపు రెండున్నర గంటలపాటు సమావేశమైన వైద్యుల గవర్నింగ్‌ బాడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

‘ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆందోళనను వీలైనంత త్వరగా ముగించాలని మేమెంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చించేందుకు వీలుగా సీఎం మమత చర్చావేదికను ఏర్పాటు చేయాలి’ అని సూచించారు. ఆందోళన చేస్తున్న వైద్యులతో సోమవారం సమావేశమయ్యేందుకు సీఎం అంగీకరించారని  ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సచివాలయం పక్కనే ఉన్న ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఒక్కో ఆసుపత్రి నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున ఈ కార్యక్రమానికి ఆహ్వా నించామని పేర్కొన్నారు. ఈ చర్చకు మీడియాను ఆహ్వానించాలన్న డాక్టర్ల ప్రతిపాదనపై మమత సుముఖంగా లేరని స్పష్టం చేశారు.  

నేడు దేశవ్యాప్త సమ్మె..
బెంగాల్‌లో వైద్యులపై దాడికి నిరసనగా సోమవారం దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) ప్రకటించింది. ఈ ఆందోళన నేపథ్యంలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు అన్నిరకాల వైద్యసేవలు(అత్యవసర సేవలు మినహా) నిలిచిపోతాయని తెలిపింది. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిపై దాడిచేసే వ్యక్తులను శిక్షించేందుకు కేంద్రం సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేసింది. శిక్షాస్మృతిని సవరించాలని కోరింది. గత సోమవారం ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీలో ఓ రోగి చనిపోవడంతో అతని బంధువులు ఇద్దరు డాక్టర్లను చితకబాదారు.

ఈ దాడికి నిరసనగా బెంగాల్‌లోని వైద్యులంతా ఆందోళనకు దిగగా, దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు సంఘీభావం తెలిపారు. మరోవైపు, ఆందోళన కారణంగా బెంగాల్‌లో అత్యవసర సేవలకూ ఇబ్బంది కలుగుతోంది. ఈ ఆందోళనల కారణంగా కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఏం ప్రభుత్వ ఆసుపత్రిలో శామ్యూల్‌ అనే వ్యక్తి గుండె ఆపరేషన్‌ ఆగిపోయింది.  తామంతా చాలా దూరప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వచ్చామనీ, ఇప్పుడు చికిత్స తీసుకోకుండా స్వస్థలాలకు తిరిగి వెళ్లలేమని రోగులు, వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా