లోక్‌పాల్‌గా జస్టిస్‌ ఘోష్‌ ప్రమాణం

24 Mar, 2019 03:50 IST|Sakshi
జస్టిస్‌ ఘోష్‌తో లోక్‌పాల్‌గా ప్రమాణంచేయిస్తున్న రాష్ట్రపతి కోవింద్‌

న్యూఢిల్లీ: దేశంలో తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ శనివారం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి కోవింద్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. ప్రజాప్రతినిధుల అవినీతికి సంబంధించిన కేసులను విచారించే లోక్‌పాల్, లోకాయుక్తా చట్ట్టం 2013లో ఆమోదం పొందింది. లోక్‌పాల్‌లో జ్యుడీషియల్‌ సభ్యులుగా జస్టిస్‌ దిలీప్‌ బీ భోసాలే, జస్టిస్‌ ప్రదీప్‌ కుమార్‌ మొహంతి, జస్టిస్‌ అభిలాష కుమారి, ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్‌కుమార్‌ త్రిపాఠిలు నియమితులయ్యారు.

నాన్‌–జ్యుడీషియల్‌ సభ్యులుగా పారా మిలటరీ దళమైన సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌సీబీ) మాజీ చీఫ్‌ అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ చీఫ్‌ సెక్రటరీ దినేష్‌కుమార్‌ జైన్, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి మహేంద్ర సింగ్, గుజరాత్‌ కేడర్‌ మాజీ ఐఏఎస్‌ ఇంద్రజిత్‌ ప్రసాద్‌ గౌతమ్‌లు వ్యవహరించనున్నారు. నిబంధనల ప్రకారం లోక్‌పాల్‌ కమిటీలో చైర్‌పర్సన్, గరిష్టంగా ఎనిమిది మంది సభ్యులు ఉండాలి. అందులో నలుగురు జ్యుడీషియల్‌ సభ్యులతోపాటు 50 శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు, మహిళలు ఉండాలని నిబంధనల్లో ఉంది. కమిటీలోని చైర్‌పర్సన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. భారత ప్రధాన న్యాయమూర్తికి ఉండే జీతాభత్యాలే చైర్‌పర్సన్‌కు, సుప్రీంకోర్టు జడ్జీలకు ఉండే జీతాభత్యాలే సభ్యులకు ఉంటాయి.
 

మరిన్ని వార్తలు