కన్హయ్యకు షరతులతో బెయిల్

3 Mar, 2016 02:04 IST|Sakshi
కన్హయ్యకు షరతులతో బెయిల్

విచారణకు సహకరించాలని ఢిల్లీ హైకోర్టు నిర్దేశం
♦ విచారణ కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదు
♦ రూ. 10 వేల చొప్పున బాండు, పూచీకత్తు ఇవ్వాలి
♦ విద్యార్థుల సిద్ధాంతాలు ఏవైనా రాజ్యాంగానికి లోబడాలి
 
 న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్యకు ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కన్హయ్యకు ఊరట కల్పిస్తూ జస్టిస్ ప్రతిభారాణితో కూడిన ధర్మాసనం ఆరు నెలల కాలానికి బెయిల్ మంజూరు చేసింది. ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, కేసు దర్యాప్తునకు సహకరించాలని నిర్దేశించింది. అవసరమైనపుడు అధికారుల ఎదుట ఆయన హాజరుకావాలని, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. విడుదల కోసం  రూ. 10 వేల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలంది. తాను భారత్‌కు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలూ చేయలేదంటూ కన్హయ్య బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా హైకోర్టు మంజూరు చేసింది. మిగతా ఇద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

 నా కుమారుడు ఉగ్రవాది కాదు: కన్హయ్య తల్లి
 ‘‘నా కుమారుడు ఉగ్రవాది కాదు. ఈ విషయాన్ని ప్రపంచమంతా త్వరలో తెలుసుకుంటుంది. అతడిపై నాకు విశ్వాసముంది. తనను ఇరికించిన ప్రత్యర్థులతో అతడు పోరాడుతాడు’’ అని కన్హయ్య తల్లి మీనాదేవి పేర్కొన్నారు. తన కుమారుడికి బెయిల్ మంజూరు కావటం పట్ల ఆమె బీహార్ నుంచి పీటీఐ వార్తా సంస్థతో ఫోన్‌లో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ప్రతి తల్లికీ ఆమె బిడ్డ గొప్పే. అతడు తప్పు చేస్తే శిక్షించండి.. కానీ అతడిని ఉగ్రవాది అనొద్దు’’ అని చెప్పారు. కన్హయ్యకు బెయిల్ రావటం తమకు శుభవార్త అని.. వర్సిటీలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నామని జేఎన్‌యూ రిజిస్ట్రార్ భూపీందర్ జుట్షి బుధవారం పీటీఐతో పేర్కొన్నారు.

 జేఎన్‌యూ విద్యార్థుల హర్షాతిరేకాలు...
 కన్హయ్యకు బెయిల్ మంజూరైందన్న వార్త తెలియగానే.. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్ ఎదుట గుమిగూడి ఉన్న జేఎన్‌యూ విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆనందోత్సాహం వెల్లువెత్తింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకటన కోసం అక్కడే వేచిచూశారు. కన్హయ్యకు బెయిల్ గొప్ప ఊరట అని.. ఇంకా జైలులోనే ఉన్న ఉమర్, అన్బిరన్‌ల కోసం తమ పోరాటం కొనసాగిస్తామని జేఎన్‌యూఎస్‌యూ ఉపాధ్యక్షురాలు షీలారషీద్ పేర్కొన్నారు.
 
 దేశ వ్యతిరేక ర్యాలీపై తీవ్ర ఆగ్రహం
 పార్లమెంటు దాడి కేసులో దోషిగా నిర్ధారితుడై ఉరిశిక్షకు గురైన అఫ్జల్‌గురు, 1971లో విమానం హైజాక్ చేసిన కేసులో దోషిగా నిర్ధారితుడై ఉరిశిక్షకు గురైన మక్బూల్‌భట్‌ల ఫొటోలు, పోస్టర్లు ప్రదర్శిస్తూ విద్యార్థులు నిరసన చేపట్టిన తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఆ నినాదాల్లో ప్రతిఫలించిన విద్యార్థుల మనోభావాలపై.. ఆ ఫొటోలు, పోస్టర్లు పట్టుకుని ఫొటోల ద్వారా రికార్డుల్లో నమోదైన విద్యార్థి లోకం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. ‘‘కన్హయ్య జేఎన్‌యూలో పీహెచ్‌డీ చేస్తున్న మేధో వర్గానికి చెందిన వ్యక్తిగా కోర్టు గుర్తిస్తోంది. అతడు ఎటువంటి రాజకీయ సిద్ధాంతం లేదా అనుబంధాన్నయినా కలిగివుండొచ్చు.. అయితే అది భారత రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలి. భారత పౌరుల వాక్‌స్వాతంత్య్రం.. రాజ్యాంగంలోని 19(2) అధికరణ కింద సహేతుక నియంత్రణలకు లోబడి ఉంటుంది’’ అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంచేసింది.

మరిన్ని వార్తలు