బత్తాయి పండ్ల వ్యాపారికి ‘పద్మశ్రీ’

27 Jan, 2020 21:10 IST|Sakshi

చదువుకోలేదు కానీ వందల మందికి విద్యను అందిస్తున్నాడు. 
ఆస్తులు లేవు కానీ ఎంతో మంది పేదలను ఆదుకుంటున్నాడు.  
పండ్లను విక్రయిస్తూ వచ్చిన డబ్బును పేద పిల్లల చదువుకు ధారపోస్తున్నాడు.

సాయం చేయాలంటే ధనవంతులే అయి ఉండక్కర్లేదని, పెద్ద మనసు ఉంటే చాలని నిరూపించాడు కర్ణాటకకు చెందిన హరేకల హజబ్బా. పండ్లను విక్రయిస్తూ గడిచిన 20 ఏళ్లుగా వందల మంది పేద విద్యార్థులను చదివిస్తున్నాడు. ఈ పేదోడి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం భారత నాల్గవ అత్యున్నత పురస్కారం ‘ పద్మ శ్రీ’  ప్రకటించింది. విద్యారంగంలో అతను చేస్తున్న అసమాన సేవకు గాను ఈ అవార్డు లభిచింది. ‘అక్షర శాంత’గా ప్రసిద్ధిగాంచిన హజబ్బా గురించి తెలుసుకుందాం.

(చదవండి : జైట్లీ, సుష్మాకు విభూషణ్‌)

పేదవాడే కానీ..
దక్షిణ కర్ణాటకలోని కోణాజీ సమీపంలో ఉన్న హరెకళ న్యూపడ్పు గ్రామానికి చెందిన హజబ్బా నిరక్షరాస్యుడు,పేదవాడు. బత్తాయి పండ్లను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పండ్లను విక్రయిస్తే వచ్చిన డబ్బులతో తన సొంత గ్రామంలోని పేద పిల్లలను చదిస్తున్నారు. తనలాగా ఎవరూ నిరక్షరాస్యులు కారాదని సంకల్పించి గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేశారు.  దాని నిర్మాణం కోసం ఐదువేల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇతర దాతలు, ప్రభుత్వం సహాయంతో స్థలంలో ఆ పాఠశాలను ఏర్పాటు చేశారు.  1999లో నిర్మించిన ఆ పాఠశాలలో వందలాది పేదవిద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.  అదే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలగా మారింది. 

 ఆ ఆలోచన పుట్టిందిలా..
‘గతంలో ఓ విదేశీ జంట నా దగ్గరకు వచ్చి పండ్ల  ధర ఎంత అని ఆంగ్ల భాషలో అడిగింది. నాకు తుళు,బెరీ భాష తప్ప వేరేది రాదు. వారు ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పలేకపోయా. దీంతో విసుగు చెందిన ఆ జంట అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు చాలా బాధపడ్డాను. ‘నేను చదువుకొని ఉండి ఉంటే ఇలా జరిగేదా అనుకున్నాను. చదువుకోలేకపోవడం వల్లే నాకు వారి భాష అర్థం కాలేదు. నాలాగా ఎవరూ బాధపడొద్దని నిర్ణయించుకున్నాను. అప్పటినుంచే పేద పిల్లలకు చదువు కోసం సహాయం చేశాను. మా గ్రామంలోని  పేద పిల్లలందరు ఇప్పుడు చదువుకుంటున్నారు. మా గ్రామంలో ఓ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను’  అని ఓ జాతీయ మీడియాతో హజబ్బా అన్నారు. 

(చదవండి : బ్రెజిల్‌ పద్మశ్రీలు)

నమ్మలేకపోయాడు
పద్మశ్రీ అవార్డు వచ్చిన విషయం అధికారులు చెప్పే వరకు నాకు తెలియదు. రేషన్‌ బియ్యం తీసుకునేందుకు షాపు ముందు క్యూలో నిలుచున్న నా దగ్గరకు అధికారులు వచ్చి ఈ అవార్డు వచ్చిందని తెలిపారు.  దీంతో ఇది కలా, నిజమా అని నమ్మలేకపోయా’ అని హజబ్బా అన్నారు.

ఎన్నో అవార్డులు, మరెన్నో ప్రశంసలు
ఎంతో మంది పేద పిల్లలకు చదువును అందిస్తున్న హజబ్బాను మంగళూరు వాసులు ముద్దుగా ‘అక్షర శాంత’ గా పిలుచుకుంటారు. ఆయన జీవిత విశేషాలను మంగళూరు యూనివర్సీటీలో సిలబస్‌గా పెట్టారు. కేరళలోని కర్ణాటక మీడియం పాఠశాలలలో ఆయన చరిత్రను పాఠ్యాంశంగా చేర్చారు. 2009లో సీఎన్‌ఎన్‌ ఏబీఎన్‌ ‘రియల్‌ హీరోస్‌’  అవార్డును పొందారు. ఈ అవార్డు కింద వచ్చిన 5లక్షల రూపాయలతో పాఠశాల కోసం స్థలాన్ని కొన్నారు. 

తన పేదరికం గురించి ఆలోచించకుండా పేదపిల్లల చదువుల గురించి ఆలోచిస్తున్న హజబ్బాపై  జాతీయ స్థాయిలో  ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే అవేమీ పట్టించుకోడు హజబ్బా. తన పని తాను చేసుకుపోతారు.

మరిన్ని వార్తలు