కరుణానిధి అంత్యక్రియలు పూర్తి

8 Aug, 2018 16:28 IST|Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్‌ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, లక్షలాది మంది అభిమానులు ఆశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. సాయంత్రం 6.15 గంటలకు మెరీనా బీచ్‌కు చేరుకున్న ఆయన భౌతికకాయానికి తొలుత పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆ తర్వాత త్రివిధ దళాలు ఆయన భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించాయి. కరుణానిధి పార్థీవదేహంపై కప్పి ఉంచిన జెండాను స్టాలిన్‌కు అందజేశారు. అనంతరం డీఎంకే జెండాను కప్పారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు కడసారి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఆ తర్వాత త్రివిధ దళాలు కరుణ పార్థీవదేహాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన పేటికలో ఉంచి ఖననం చేశారు. ఆ సమయంలో భద్రత బలగాలు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు.

ఈ అంత్యక్రియలకు మాజీ ప్రధాని దేవేగౌడ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రి పొన్‌ రాధకృష్ణన్‌, ఏపీ సీఎం చంద్రబాబు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరిక్‌ ఓబ్రీన్‌, తమిళనాడు మంత్రి డి జయకుమార్‌, గులాంనబీ అజాద్‌, శరద్‌ పవార్‌, వీరప్ప మొయిలీతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మెరీనా బీచ్ ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది.

రాజాజీ హాల్‌ నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర వాలాజా రోడ్‌, చెపాక్‌ స్టేడియం మీదుగా దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగింది. దారి పొడువునా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కరుణానిధికి కన్నీటి నివాళులర్పించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు