లెక్కించేందుకు  కేసు వాయిదా...

25 Jul, 2018 23:07 IST|Sakshi

లాయర్ల బుర్ర ఎంత షార్ప్‌గా, నేర్పుగా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ... ఓ న్యాయవాది తనదైన శైలిలో మాజీ భార్యపై కక్ష తీర్చుకున్నాడు. విడాకుల తర్వాత నెలకు రూ.25 వేల చొప్పున మనోవర్తి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సదరు లాయిర్‌ పట్టించుకోవడం లేదంటూ మాజీ భర్తపై ఆ యువతి పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. ఆ లాయర్‌ ప్రాక్టీస్‌ బాగా నడుస్తోందని, అంతే కాకుండా అతడి పేరిట ఆస్తులు కూడా ఉన్నాయంటూ విన్నవించింది. ఈ నేపథ్యంలో గతంలో పేర్కొన్న విధంగా నెలకు రూ. 25 వేల మనోవర్తి చెల్లించాలని ఆ న్యాయవాదికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాతే అసలు డ్రామా అంతా చోటుచేసుకుంది.

ఈ మనోవర్తిని  నాలుగు వందరూపాయల నోట్లతో పాటు మిగతా మొత్తం (రూ.24,600) ఒకటి, రెండు రూపాయి నాణాలతో కూడిన చిల్లర రూపంలో ఓ సంచిలో పెట్టి అక్కడి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆ లాయర్‌ అందజేశాడు. తనను వేధించేందుకు ఇదొక కొత్త పద్ధతి అని, ఇది చట్టాన్ని అపహాస్యం చేయడమేనని ఆ యువతి వాదించింది. తమ కేసు ఎనో‍్నసార్లు  వాయిదా పడిన తర్వాత ఇప్పుడు చిల్లర రూపంలో డబ్బు ఇవ్వడం న్యాయం కాదని పేర్కొంది.. అయితే తన చర్యను న్యాయవాది సమర్థించుకుంటూ డబ్బును కేవలం వంద, ఐదువందలు, రెండువేల నోట్ల కరెన్సా రూపంలోనే ఇవ్వాలని ఎక్కడా లిఖితపూర్వకంగా రాసి పెట్టి లేదని వాదించాడు. ఈ నాణేలను లెక్కించేందుకు తను ముగ్గురు సహాయకులను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చాడు.  నాణేల లెక్కింపునకు సమయం సరిపోక జిల్లా కోర్టు జడ్జీ చివరకు కేసును వాయిదా వేయాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు