లాయర్‌ని కాస్త విధి ట్రక్‌ డ్రైవర్‌గా మార్చింది! అదే ఆమెను..

20 Sep, 2023 15:57 IST|Sakshi

ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి అడ్డంకులైనా అలవొకగా ఎదుర్కొని సాధించొచ్చు అనేందుకు ఆ మహిళ నిలువెత్తు నిదర్శనం. లా చేసినా.. పరిస్థితులు తలికిందులై హేళన చేసినా.. తగ్గేదే లే అని పొట్ట పోషణ కోసం మగాడిలా కష్టపడింది. మగవాళ్లు చేసే పనిలో దూసుకుపోయింది. అడగడుగున అవహేళనలు, వెక్కిరింతలు, అసహ్యమైన చూపులు అవన్నీ పక్కకు నెట్టి తన మార్గంలో తాను అజేయంగా దూసుకుపోయింది. మహిళలు చేయలేని పని అంటూ ఏమిలేదని అందరిచేత ప్రశంసలందుకోంటోంది యోగితా రఘువంశీ. న్యాయవాది నుంచి ట్రక్‌ డ్రైవర్‌గా మలుపు తిరిగిన తన జీవన ప్రయాణం గురించి ఆమె మాటల్లో...

లాయర్‌ అయినా యోగితా రఘువంశీ పొట్ట పోషణ కోసం డ్రైవర్‌గా మారింది. అదికూడా ఓ ట్రక్‌ డ్రైవర్‌గా ఎన్నో వేల మైళ్లు వెళ్లింది. దేశంలో దాదాపు చాలా రాష్ట్రాల సరిహద్దులను చుట్టి వచ్చింది. పురుషులు ప్రాబల్యం అధికంగా ఉన్న ఆ వృత్తిలో మధ్యప్రదేశ్‌కు చెందిన యోగిత రఘువంశీ గత 15 ఏళ్లుగా ఎన్నో మైళ్లు ప్రయాణించారు. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ దేశంలో సగానికి పైగా ప్రయాణించింది. యోగిత లా, బిజినెస్‌లో డిగ్రీ చేసింది కూడా. అలాగే సెలూన్‌, డ్రస్‌ డిజైన్‌ కోర్సులలో కూడా పనిచేసింది. న్యాయవాద వృత్తిని కొనసాగించాలని భర్త సూచించినా పట్టించుకోలేదు.  భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా సంతృృప్తిగా సాగిపోతుంది కదా జీవితం అనుకుంది.

అందువల్లే పెద్దగా డబ్బులు వెనకేసుకుంది కూడా లేదు. సరిగ్గా అదే సమయంలో భర్త అకాల మరణంతో ప్రశ్నార్థకంగా మారిన పిల్లల పోషణ ఆమెను స్టీరింగ్‌ పట్టుకుని డ్రైవింగ్‌ చేసేలా చేసింది. ఇక ఈ వృత్తిలో ఎన్నో మైళ్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. పైగా ఆమె ఒక్కోరోజు భోపాల్‌ నుంచి హైదరాబాద్‌ వరకు దాదాపు 11 వందల మైళ్ల దూరాన్ని కేవలం మూడు రోజుల్లోనే చేసింది. ఆ ప్రయాణంలో ఎన్నో అసభ్యకరమైన వ్యాఖ్యలు, చూపులు, ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కోంటూ సాగింది. అలాగే ట్రక్‌ డ్రైవర్లు రాష్ట్ర సరిహద్దుల వద్ద ఎదుర్కొటున్న వేధింపులను నిర్మొహమాటంగా చెప్పింది.

ఆర్టీవోలు ప్రభుత్వం నుంచి వచ్చే జీతాల కన్నా డ్రైవర్ల నుంచి రాబట్టే మాముళ్లతోనే ఇళ్లను నడుపుతున్నారని చెప్పుకొచ్చింది. ఓ ప్రముఖ రవాణా సంస్థ ఏఐటీడబ్ల్యూఏ  ప్రత్యేక కార్యదర్శి సుమితా దావ్రా సమక్షంలో ఈ విషయాలన్ని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె పేరు మారుమ్రోగిపోయింది. ఈమేరకు యోగితా రఘువంశీ మాట్లాడుతూ..ద్వేషపూరితమైన మనుషుల మధ్య నా కెరియర్‌ ప్రారంభమైంది.

ఇప్పుడూ నాకంటూ ఓ సొంత మార్గాన్ని ఏర్పరుచుకున్నా. అంతేగాదు పురుషుడు ఎక్కువగా ఉండే ఈ రంగంలో నమ్మకమైన శక్తిమంతమైన మహిళగా పేరుతెచ్చుకున్నా. ఒక పక్క నావృత్తి చేస్తూనే..సరిహద్దుల మధ్య ఎదరవుతున్న లింగ వివక్ష, అవినీతిపై పోరాడుతున్నా అని ధైర్యంగా చెబుతోంది యోగితా రఘువంశీ. అతేకాదు ఆమె 2006లో ట్రక్‌ డ్రైవర్‌గా లైసెన్స్‌ పొందింది. దీంతో భారతదేశంలో లైసెన్స్‌ పొందిన తొలి మహిళా ట్రక్‌ డ్రైవర్‌గా యోగిత ఘనత సృష్టించింది. 

(చదవండి: మెషీన్స్‌కూ..మదర్‌టంగ్‌ కావాలోయ్‌!)

మరిన్ని వార్తలు