‘రాష్ట్రం వదిలి వెళ్లిపోతాం’

6 Jun, 2014 22:28 IST|Sakshi

బదౌన్: బాలికలపై అత్యాచారం,హత్య కేసులో న్యాయం కోసం పోరాడేందుకు ‘బదౌన్’ సామూహిక అత్యాచార ఘటన బాధిత కుటుంబసభ్యులు రాష్ట్రం విడిచివెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. తొమ్మిది రోజుల కిందట కదత్‌గంజ్ గ్రామంలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికీ ఆ కుటుంబం భయం నీడన గడుపుతోంది. తమ కుటుంబంపై ఎప్పటికైనా నిందితుల కుటుంబాలు దాడిచేసే అవకాశం ఉందని, పోలీసులు కూడా మొదటినుంచి ఈ కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు శుక్రవారం మీడియా ముందు వాపోయారు.
 
నిందితుల కుటుంబాలు తమను బెదిరిస్తున్నాయని, ఇంకా మేం ఇక్కడే ఉంటే మొత్తం కుటుంబాన్ని వారు అంతం చేసే ప్రమాదముందని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ‘మా కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటేనే న్యాయం జరుగుతుంది. మేం ఈ ఊరునే కాదు.. ఏకంగా రాష్ట్రాన్నే వదిలేసి ఢిల్లీ వెళ్లిపోతున్నాం. నిందితులకు తగిన శిక్ష పడేంతవరకు అక్కడనుంచే మేం న్యాయం కోసం పోరాడతాం..’ అని  చెప్పారు. అన్ని పార్టీల నాయకులు తమను కలిసి జరిగిన అన్యాయాన్ని ఖండించారు కాని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం ఇంతవరకు తమను పలకరించలేదని ఆయన వాపోయాడు.

మరిన్ని వార్తలు