సెంటినలీస్‌ స్నేహితురాలు!

3 Dec, 2018 05:35 IST|Sakshi
సెంటినలీస్‌ శిశువుతో మధుమాల

అండమాన్‌ ఆదివాసీలతో మమేకమైన మధుమాల ఛటోపాధ్యాయ

1999లో వారితోనే నెలల తరబడి జీవనం

గాలి, నీరు, చెట్టు, పుట్ట ఇవే వారికి జీవితం, ఆరాధ్యం. అంతకు మించిన కాంక్రీటు జంగిల్‌కి సంబంధించిన భవబంధాలేవీ వారు కోరుకోరు. వారే అండమాన్‌లోని సెంటినలీస్‌ తెగకు చెందిన ఆదివాసీలు. దాదాపు 60,000 సంవత్సరాలుగా ఆ తెగ అక్కడ మనుగడ సాగిస్తోంది. తమదైన ప్రత్యేక ప్రపంచంలో జీవిస్తోన్న వారిని దూరం నుంచి చూడటమే తప్ప వారి దగ్గరకు వెళ్ళడం అసాధ్యం. 2004 తరువాత ప్రభుత్వం కూడా ఆదివాసీలున్న ప్రాంతానికి ఇతరులు వెళ్ళడాన్ని నిషేధించింది. వారి కళ్లుగప్పి వారి దరిదాపుల్లోకి వెళ్ళిన వాళ్ళెవ్వరూ బతికిబట్టకట్టలేదు.

ఇటీవలే జాన్‌ అలెన్‌ చౌ అనే క్రిస్టియన్‌ అమెరికన్‌ మిషనరీ యువకుడు వారి సామ్రాజ్యంలోకి చొరబడి వారి బాణాల దెబ్బలకు చనిపోయిన సంగతి తెలిసిందే. సెంటినలీస్‌ను దగ్గరి నుంచి కూడా చూడటానికి జంకుతున్న వేళ, వారితో స్నేహ కరచాలనాన్ని అందుకొని మమేకమైన ఏకైక సామాజిక శాస్త్ర పరిశోధకురాలు మధుమాల ఛటోపాధ్యాయ. అరుదైన ఆదివాసీ తెగ సెంటినలీస్‌ని 1999లో తొలిసారిగా కలిసిన మధుమాల ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. జాన్‌ అల్లెన్‌ చౌ మరణరహస్యాన్ని కూడా ఆమె ఛేదించే ప్రయత్నం చేశారు.

ముందు హెచ్చరికలు.. తరువాతే దాడి..
దశాబ్దాలుగా బాహ్యప్రపంచాన్ని వెలివేస్తూ అండమాన్‌ అటవీ ప్రాంతంలో తమదైన చిన్ని ప్రపంచంలో నివసిస్తున్న సెంటినలీస్‌ చాలా బలంగా ఉంటారు. ఒక్క మధ్య వయస్కుడు బలీయమైన ఐదుగురు యువకులను సైతం అవలీలగా మట్టికరిపించగలడు. నిజానికి సెంటినలీస్‌  తమంతట తామే దాడికి దిగరని తెలిపారు. తమ హెచ్చరికలను లెక్కచేయకుండా ముందుకెళితేనే వారు దాడికి దిగుతారంటారు మధుమాల. పరిశోధనలో భాగంగా నెలల తరబడి సెంటినలీస్‌తో గడిపిన మధుమాల ఒకరోజు అక్కడి నుంచి బయటి ప్రపంచానికి ప్రయాణమయ్యారు. కాసేపట్లో వర్షం కురుస్తుందని, వెళ్ళొద్దని వాళ్ళు వారించారు.

అప్పటిదాకా కాసిన మండుటెండ మాయమై  వర్షం రావడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. వాళ్ళెంతగా ప్రకృతిలో లీనమై ఉంటారనడానికి మధుమాల చెప్పిన ఉదాహరణ ఇది. సెంటినలీస్‌ అంతిమసంస్కారాలు సైతం ప్రత్యేకంగా ఉంటాయి. మృతుల పోలిక ఉన్న చెక్కబొమ్మను చేసి, దాని పక్కనే వారికిష్టమైన ఆహారాన్ని, నీటిని పెడతారు. 1999లో సెంటినలీస్‌ని కలిసినప్పుడు మధుమాలను ‘‘మిలాలే, మిలాలే’’ అని పిలిచేవారు. మిలాలే అంటే వారి భాషలో మిత్రులని అర్థం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఇతరత్రా  సందర్భాల్లో  సెంటినలీస్‌కు అలవాటైన కొందరినే ప్రభుత్వం అక్కడికి పంపిస్తుంది.
 

మరిన్ని వార్తలు