ఓటమితో కాంగ్రెస్‌ శిబిరంలో కాక..

27 May, 2019 08:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మధ్యప్రదేశ్‌లో కమల్‌ నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్‌లో కాక రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని 29 స్ధానాలకు గాను 28 స్ధానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ పావులు కదుపుతోందన్న వార్తలు కాంగ్రెస్‌లో గుబులు రేపుతుండగా, పార్టీలో అంతర్గత పోరు పతాకస్ధాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. యువ నేత, మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కీలక బాధ్యతలు అప్పగించాలని 72 ఏళ్ల కమల్‌ నాథ్‌ నేతృత్వంలో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని సింధియా వర్గం డిమాండ్‌ చేస్తుండటం ఆ పార్టీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపొందిన అనంతరం యువనేత జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌ నాథ్‌ల మధ్య స్వయంగా పార్టీ చీఫ్‌ రాహుల్‌ సయోధ్య కుదిర్చినా ఇరు వర్గాలకు పొసగకపోవడం ఎంపీ కాంగ్రెస్‌లో గుబులు రేపుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం నేపథ్యంలో జ్యోతిరాదిత్యకు మధ్యప్రదేశ్‌ పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్‌ ఊపందుకోవడం కమల్‌ నాథ్‌ వర్గీయులకు మింగుడుపడటం లేదు. మరోవైపు పార్టీ ఓటమిపై అభ్యర్ధులతో కమల్‌ నాథ్‌ నిర్వహించిన సమీక్షా సమావేశంలో జ్యోతిరాదిత్యకు సన్నిహితులైన మంత్రులు యువనేత జ్యోతిరాదిత్యకు రాష్ట్ర పార్టీ చీఫ్‌గా నియమించాలనే డిమాండ్‌ను ముందుకుతేవడం కమల్‌ నాథ్‌కు ఇబ్బందికరంగా పరిణమించింది. మధ్యప్రదేశ్‌ పార్టీ చీఫ్‌గానూ కమల్‌ నాథ్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు