మురుగదాస్‌కు హైకోర్టులో ఊరట

9 Nov, 2018 18:57 IST|Sakshi

సాక్షి, చెన్నై: సర్కార్‌ మూవీ తమిళనాట పలు వివాదాలకు కేంద్రబిందువవుతోంది. ఈ సినిమాలోని కొన్ని డైలాగులు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని పాలక ఏఐఏడీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈనెల 27 వరకూ సర్కార్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ను అరెస్ట్‌ చేయవద్దని మద్రాస్‌ హైకోర్ట్‌ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐఏడీఎంకే నేతలు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చేపట్టిన నిరసనలకు తలొగ్గిన చిత్ర మేకర్లు వివాదాస్పద సంభాషణలను తొలగించేందుకు అంగీకరించారు. చిత్ర దర్శకుడు మురుగదాస్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఆయన మద్రాస్‌ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఏ ఒక్కరినీ బాధపెట్టాలన్నది తన ఉద్దేశం కాదని మురుగదాస్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాగా మురుగదాస్‌ను అరెస్ట్‌ చేసేందుకు చెన్నై పోలీసులు సిద్ధమయ్యారని గురువారం రాత్రి చిత్ర నిర్మాతలు సన్‌ పిక్చర్స్‌ ట్వీట్‌ చేయగా, పోలీసు అధికారులు దీన్ని తోసిపుచ్చారు. రొటీన్‌ గస్తీలో భాగంగా ఆ ప్రాంతంలో పోలీస్‌ బృందం పహారాలో ఉందని వివరణ ఇచ్చారు. మరోవైపు గత రాత్రి పోలీసులు తమ ఇంటికి వచ్చి తన తలుపు తట్టారని, ఆ సమయంలో తాను ఇంట్లో లేకపోవడంతో వారు వెనుదిరిగారని, ప్రస్తుతం తన ఇంటి వద్ద పోలీసులు ఎవరూ లేరని తనకు తెలిసిందని దర్శకుడు మురుగదాస్‌ ఆ తర్వాత ట్వీట్‌ చేశారు.

సర్కార్‌ మూవీకి నిరసనల సెగతో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ చిత్ర బృందానికి బాసటగా నిలిచారు. ఒత్తిడి పెంచేందుకు ఇలాంటి చర్యలను ఎంచుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. కాగా సర్కార్‌ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించారు.విజయ్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలైన రెండు రోజులకే రూ 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

మరిన్ని వార్తలు