వీరే ‘మహా’ మార్చ్‌ సారథులు

14 Mar, 2018 03:08 IST|Sakshi

దాదాపు 50 వేల మంది రైతులు, ఆదివాసీలు.. మండుటెండలో రోజుకు దాదాపు 30 కిలో మీటర్ల చొప్పున ఆరురోజులు నడక.. దారిలోనే అన్నపానీయాలు, ఆరుబయటే విశ్రాంతి.. సోలార్‌ ప్యానెళ్లతో సెల్‌ఫోన్ల చార్జింగ్‌.. ముంబై చేరుకుని, ప్రభుత్వం నుంచి హామీలు పొంది విజయవంతంగా ముగిసిన ఉద్యమం.. మహారాష్ట్ర రైతుల మహా మార్చ్‌.

ఈ మొత్తం పాదయాత్రలో ఎక్కడా చిన్న అపశ్రుతి లేదు. హింసాత్మక ఘటనలు లేవు. అసాంఘిక శక్తుల అలజడులు లేవు. ఇతరులు ఇబ్బందిపడ్డ సందర్భాలు లేవు. ఏ సందర్భంలోనూ క్రమశిక్షణ తప్పలేదు. పైగా, ట్రాఫిక్‌ సమస్యతో ముంబైలో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు కష్టం కలగకుండా చూడటం కోసం రాత్రంతా నడిచి, ఆజాద్‌ మైదాన్‌కు చేరుకున్న మంచితనం. ఇంత ప్రణాళికాబద్ధంగా, క్రమశిక్షణతో సాగిన ఉద్యమ సారథులు ఎవరు? సూత్రధారులు ఎవరు?

జీవా పాండు గావిట్‌ – సీపీఎం ఎమ్మెల్యే
నాసిక్‌ జిల్లాలోని కాల్వన్‌ నియోజకవర్గానికి గావిట్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత మహారాష్ట్ర శాసనసభలో కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ఏకైక ఎమ్మెల్యే ఈయనే. అంతేకాదు కాల్వన్‌ నుంచి ఆయన ఏడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. గిరిజన తెగకు చెందిన గావిట్‌కు నిరాడంబరుడిగా పేరుంది. రైతు పాదయాత్రకు వ్యూహ రచన చేసింది ఈయనే. తరాల నుంచి సాగుచేస్తున్న అటవీ భూములను తమకు ఇచ్చేయాలని డిమాండ్‌ చేస్తూ గిరిజనులు ఎక్కువ సంఖ్యలో మార్చ్‌లో పాల్గొనడానికి కారణం కూడా గావిట్‌ అని చెబుతారు.

అశోక్‌ ధావలే – ఏబీకేఎస్‌ అధ్యక్షుడు
రైతుల పోరాటానికి నేతృత్వం వహించింది అఖిల భారతీయ కిసాన్‌ సభ (ఏబీకేఎస్‌). సీపీఎం అనుబంధ సంస్థ అయిన ఏబీకేఎస్‌కు అశోక్‌ ధావలే ఇటీవలే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన సామాజిక కార్యకర్త గోదావరి పారులేకర్‌ సిద్ధాంతాలను గట్టిగా నమ్ముతారు. 1993 నుంచి ఠాణే, పాల్ఘర్‌ జిల్లాల్లో రైతు సమస్యలపై ధావలే పోరాటాలు సాగిస్తున్నారు.

దశాబ్దం క్రితం రాయ్‌గఢ్‌లో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)కి భూసేకరణను, తాజాగా ముంబై–అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు, ముంబై–నాగపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్టులకు భూసేకరణను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  

అజిత్‌ నవ్‌లే – ఏబీకేఎస్‌ రాష్ట్ర కార్యదర్శి
2017 జూన్‌లో రైతుల చేత ఆందోళనలు చేయించి ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రకటించేలా చేయడంలో అజిత్‌ నవ్‌లే పాత్ర ఎంతో కీలకం. అప్పట్లో రైతులు సంపూర్ణ రుణ మాఫీ, కనీస మద్దతు ధర పెట్టుబడి కన్నా కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉండేలా చూడాలని డిమాండ్‌ చేశారు. నగరాలు, పట్టణాలకు పండ్లు, కూరగాయల సరఫరాను నిలిపివేస్తామని కూడా రైతులు అప్పట్లో హెచ్చరించారు.

ఆ తర్వాత రైతు రుణ మాఫీ విధి విధానాలు ఎలా ఉండాలో నిర్ణయించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించి అజిత్‌ను కూడా అందులో సభ్యుడిగా చేర్చింది. కానీ తన మాటకు విలువ లేకపోవడంతో ఆయన కమిటీ నుంచి వైదొలిగి అప్పటి నుంచి మండల, జిల్లా స్థాయిల్లో రైతుల పోరాటాలను నడుపుతున్నారు.

విజూ కృష్ణన్‌– ఏబీకేఎస్‌ సంయుక్త కార్యదర్శి
కేరళకు చెందిన, ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) పూర్వ విద్యార్థి అయిన విజూ కృష్ణన్‌ పాత్ర కూడా రైతు పాదయాత్ర విజయవంతం కావడంలో కీలకమైనది. 1946లో కేరళలోని కన్నూర్‌ సమీపంలోని కరివేల్లూరు అనే గ్రామంలో రైతులు బ్రిటిష్‌ వారి సామ్రాజ్య, భూస్వామ్య విధానాలపై తిరుగుబాటు చేశారు.

విజూ కృష్ణన్‌ కూడా అదే గ్రామానికి చెందిన వారు. రైతుల కష్టాలు, సమస్యల గురించి వింటూ ఆయన పెరిగారు. కరివేల్లూరు రైతుల తిరుగుబాటు జరిగిన దాదాపు 70 ఏళ్ల తర్వాత దాదాపు అలాంటి డిమాండ్లతోనే మహారాష్ట్ర రైతులు ఉద్యమిస్తుండటం ఆయనను వారికి దగ్గర చేసింది. రైతులు వారి హక్కుల కోసం పోరాడేలా విజూ వారిలో స్ఫూర్తిని నింపారు.
 

–సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు