ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా చక్కని ఉపాయం

8 Nov, 2023 12:23 IST|Sakshi

ఢిల్లీ: దేశ రాజధానిలో ప్రజలు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఢిల్లీ సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో సమస్య తీవ్రతరమౌతోంది. గాలిలో కాలుష్య స్థాయిలు పెరగడంతో సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని మందలించింది. కాలుష్యాన్ని తగ్గించడానికి వెంటనే ఏదైనా పరిష్కారాన్ని కనుగొనాలను సూచించింది. ఇదే క్రమంలో కాలుష్యాన్ని తగ్గించడానికి చక్కటి పరిష్కారం ఉందని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌(ఎక్స్‌) లో పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యాన్ని  రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానంతో తగ్గించవచ్చని చెప్పారు.

" ఢిల్లీలో కాలుష్యం తగ్గడానికి రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానం ఉపయోగపడుతుంది. పంటవ్యర్థాల దహనానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఈ పద్ధతి సూచిస్తుంది. అంతేకాకుండా నేలసారం కూడా పెరుగుతుంది.' అంటూ ఇందుకు సహకరించేవారి పేర్లను కూడా ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. గాలి పూర్తిగా కలుషితం కావడంతో దేశ రాజధానిలో నవంబర్ 10 వరకు పాఠశాలలకు సెలవులు కూడా ఇచ్చారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  నవంబర్ 13 నుంచి 20 వరకు వాహనాలకు సరి-భేసి విధానాన్ని కూడా అమలుపరచనుంది. ప్రస్తుతం పంజాబ్‌లో పంట కోతలు అయిపోయి.. ఆ వ్యర్ధాలను దహనం చేసే సమయం కావడం వల్ల ఢిల్లీలో పరిస్థితి తీవ్రతరమౌతోంది. 

పునరుత్పత్తి వ్యవసాయం(Regenerative Agriculture) :

పునరుత్పత్తి వ్యవసాయం అనేది వ్యవసాయం చేసే విధానాల్లో ఓ పద్ధతి. పురుగు మందులు, ఎరువులు, భారీ పనిముట్లు వాడకుండా సాగు చేస్తారు. గ్రీన్ హౌజ్ ఉద్గారాలను తగ్గించే విధానాలను ఎంచుకుంటారు. జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తూ పర్యావరణ అనుకూలంగా వ్యవసాయం చేస్తారు. పంట కోతలను కాల్చివేయకుండా వాటినే ఎరువుగా వాడుకునే విధానాలను అనుసరిస్తారు. ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ పద్ధతినే ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా సూచించారు.  

ఇదీ చదవండి: కాలుష్యంపై మీకు ఏం పట్టింపు లేదా..?


 

మరిన్ని వార్తలు