శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి

14 Jan, 2017 21:24 IST|Sakshi
శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి

కొచ్చి: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నాంబళంమేడు కొండల్లో శనివారం సాయంత్రం మకర జ్యోతి దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో ఇప్పటికే జ్యోతి దర్శనం కోసం శబరిమలకు చేరుకున్న భక్తులు జ్యోతిని చూసి ఆనంద పరవశులయ్యారు. స్వామియే శరణం అయ్యప్పా అన్న నినాదాలు మిన్నంటాయి. అయ్యప్పను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో శబరిమలకు చేరుకున్నారు. అయ్యప్పల నామస్మరణతో శబరిమల మార్మోగిపోయింది.

మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమల సన్నిధానం నుంచి పంబ వరకు బారులు తీరారు. కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు తరలివెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు మాలను ధరించి మకరజ్యోతి దర్శనం కోసం వెళ్తారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో తరలివెళ్లారు. గతంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మకరజ్యోతి దర్శనాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. అయ్యప్ప స్వామి మాలను ధరించిన భక్తులు నియమ నిష్టలతో దీక్షను ఆచరించి దర్శనానికి వెళ్తారు.

మరిన్ని వార్తలు