రైల్వేల్లో కొత్త తరహా టాయిలెట్లు

17 Jun, 2016 16:14 IST|Sakshi
రైల్వేల్లో కొత్త తరహా టాయిలెట్లు

రైళ్లలో ఉపయోగించేందుకు వీలుగా నీళ్ల అవసరం లేని టాయిలెట్లను తయారుచేసిన ఓ ఫ్యాకల్టీకి రైల్వేశాఖ నిర్వహించిన పోటీలో రెండో ప్రైజ్ దక్కింది. మణిపాల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్కిటెక్చర్(ఎఫ్ఓఏ) పదో సెమిస్టర్ చేస్తున్న వినోద్ అంథోని థామస్ ఇండియన్ రైల్వేల కోసం ప్రత్యేకంగా ఈ టాయిలెట్‌ను రూపొందించారు. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) నిర్వహించిన ఈ పోటీలో.. నీటి అవసరం లేకుండా వాడుకోవడానికి వీలయ్యే టాయిలెట్స్ డిజైన్ చేయాలని ప్రకటనలో కోరారు.

ప్రస్తుతం రైల్వేల్లో టాయిలెట్ల నిర్వహణ, ట్రాక్‌లను శుభ్రంచేయడం పెద్ద సమస్యగా తయారయ్యాయి. వీటిని అధిగమించేందుకు, పర్యావరణానికి హాని కలుగని పద్దతుల్లో టాయిలెట్‌ను డిజైన్ చేసినట్లు వినోద్ తెలిపారు. ప్రస్తుతం రైల్వేల్లో అమల్లో ఉన్న టాయిలెట్ల వ్యవస్థకు ఒక కన్వేయర్‌ను ఉపయోగించి మానవ వ్యర్ధాలను బిన్‌కు తరలించవచ్చని మణిపాల్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. బిన్ వినియోగం వల్ల వ్యర్ధాలను లోపలికి పంపడానికి నీటిని ఎక్కువగా ఖర్చుచేయాల్సిన పని ఉండదని, డీ కంపోజింగ్ కు బిన్‌లో ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని వివరించింది.

స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో ఈ పోటీని ప్రారంభించారు. మే నెలలో ఈ పోటీకి ఎంట్రీలను స్వీకరించగా.. రైల్వే, ఇండస్ట్రీ, పరిశోధన రంగాలకు చెందిన నిపుణులు వినోద్, రాహుల్, సౌరభ్ హాన్స్ లతో కూడిన బృందం తయారుచేసిన టాయిలెట్ కు రెండో స్థానాన్ని ఇచ్చారు. ఇందుకుగాను ప్రైజ్ మనీ కింద ఈ ముగ్గురికి రూ.75,000 దక్కాయి.

మరిన్ని వార్తలు