‘మన్మోహన్‌ సింగ్‌ కొలువులో చేరొచ్చు’

12 Dec, 2016 14:53 IST|Sakshi
‘మన్మోహన్‌ సింగ్‌ కొలువులో చేరొచ్చు’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గౌరవ అధ్యాపకుడిగా బాధ్యతలు చేపట్టవచ్చని మంగళవారం పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. ఆయన రాజ్యసభ సభ్యత్వంపై ఈ కొత్త బాధ్యతల ప్రభావం ఉండబోదని తెలిపింది. జవహార్‌ లాల్‌ నెహ్రూ చైర్‌ ప్రొఫెసర్‌షిప్‌ బాధ్యతలు చేపట్టేందుకు రావాలని, తీరిక ఉన్న సమయాల్లోనే తమ విద్యార్థులకు, అధ్యాపకులకు బోధించాలని కోరుతూ పంజాబ్‌ యూనిర్సిటీ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ను కోరింది. దీంతో ఆయన ఈ ఏడాది జూలై నెలలోనే అలా చేయవచ్చా లేదా అనేది తెలుసుకునేందుకు రాజ్యసభ చైర్మన్‌ను సంప్రదించారు.

భారత రాజ్యంగంలోని 102(1)(ఏ) నిబంధన తాను ఆ బాధ్యతలు చేపట్టేందుకు అనుమతి ఇస్తుందా లేదా సలహా ఇవ్వాలని కోరారు. ఈ నిబంధన ప్రకారం పార్లమెంటు ఉభయ సభల్లోని ఏ సభలో సభ్యుడు అయినా.. ఆ వ్యక్తి ఆదాయం వచ్చే ఇతర ఏ ప్రభుత్వ సంస్థలో విధులు నిర్వర్తించరాదు. దీనిపైనే వివరణ కోసమే చైర్మన్‌ ను సంప్రదించారు. అయితే, గౌరవ అధ్యాపక బాధ్యతలు మాత్రమే చేపడుతున్నందన మాజీ ప్రధాని వాటిని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చని, ఆయన రాజసభ సభ్యత్వానికి ఎలాంటి ఢోకా లేదని పార్లమెంటు కమిటీ స్పష్టం చేసింది.

మన్మోహన్‌సింగ్‌ పంజాబ్‌ యూనివర్సిటీలోనే ఎంఏ ఎకనామిక్స్‌ పూర్తి చేశారు. అనంతరం 1963 నుంచి 65 మధ్యలో ప్రొఫెసర్‌ గా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా మరోసారి ఆయన అదే యూనివర్సిటీలో తన విజ్ఞానాన్ని పంచేందుకు అవకాశం దక్కనుంది. ఈ బాధ్యతలు చేపట్టే వ్యక్తికి వర్సిటీ తరుపున విమానంలో బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌, ఓ కారు, డ్రైవర్‌, వసతి, రోజుకు రూ.5,000లు గౌరవంగా అందిస్తారు. చర్చల ద్వారా ఆయన విద్యార్థులతో, అధ్యాపకులతో బోధన చేస్తారు.
>
మరిన్ని వార్తలు