బట్టలు సరిగా ఉతకలేదని జడ్జిగారి మెమో

4 Mar, 2016 12:14 IST|Sakshi

చెన్నై:  ప్రభుత్వ ఉన్నతాధికారులు కింది ఉద్యోగులను ఇంటి పనికి వాడుకోవడం, తరచూ వేధింపులకు గురిచేయడం లోపాయికారిగా జరిగే వ్యవహారమే. అది దాచేస్తే దాగని సత్యం.  కానీ  తమిళనాడుకు చెందిన ఓ  జడ్జిగారు  మహిళా అసిస్టెంట్ కు బహిరంగంగా  జారీ  చేసిన మెమో అధికార దుర్వినియోగానికి  అద్దం పట్టింది . బట్టలు సరిగా ఉతకలేదనే కారణంతో ఈరోడ్  జిల్లా కోర్టు కార్యాలయంలో మహిళా సబార్డినేట్ కు , సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ... మెమో జారీ చేశారు.  ఆలస్యంగా  వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  

స్థానిక భాషలో(తమిళం)లో  జారీ చేసిన ఈ మెమో లో  బట్టలు, ముఖ్యంగా లో దుస్తులు  సరిగా ఉతకలేదంటూ మండిపడ్డారు. దీనికితోడు తమ మాటకు ఎదురు చెప్పావంటూ ఉగ్రుడయ్యారు.  సమాధానం చెప్పాలంటూ  మెమో జారీ చేశారు. ఆ మెమోలో ...బట్టలు..ముఖ్యంగా లోపలి వస్త్రాలు శుభ్రంగా ఉతకకపోవడం, తమ మాటలకు ఎదురు చెప్పడం, బట్టలు బైటికి విసిరేయడం.. ఎదురు  సమాధానం చెప్పడం లాంటి నేరాలపై క్రమశిక్షణా చర్య ఎందుకు  తీసుకోకూడదో  చెప్పాలన్నారు.  దీనిపై వారం రోజులుగా వివరణ ఇవ్వాలని కోరుతూ  గత నెల 1న మహిళా అసిస్టెంట్ వాసంతికి  ఆదేశాలు జారీ చేయడం  సంచలనంగా మారింది.

 దీనిపై ఆమె వివరణ ఇస్తూ  భవిష్యత్తులో  ఇలాంటి తప్పు మళ్లీ జరగదంటూ వివరణ ఇచ్చుకుంది. ఎంప్లాయ్మెంట్  ఎక్సేంజ్ ద్వారా పదేళ్ల  క్రితం తాను  విధుల్లో చేరానని, కార్యాలయంలో పనిచేయాలనుకున్న తాను చివరికి పనిమనిషిగా మారతాననుకోలేదని వాసంతి వాపోయింది. కొంతమంది ఉన్నతాధికారులుతమ అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

దీనిపై తమళనాడు జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు  ఆందోళనకు సిద్ధపడుతున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ సిబ్బందిని వినియోగించుకోరాదని ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ.. ఈ తరహా వేధింపులు కొనసాగుతున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు  కరుణాకరన్ తెలిపారు.  ఈవ్యవహారంపై స్పందించడానికి మెమో జారీ చేసిన న్యాయమూర్తి అందుబాటులో లేరని సమాచారం.

మరిన్ని వార్తలు