మైఖెల్‌ జాక్సన్‌లా డాన్స్‌.. జర జాగ్రత్త..

23 May, 2018 09:16 IST|Sakshi
‘‘స్మూత్‌ క్రిమినల్‌’’ ఆల్బమ్‌లో గ్రావిటీ డిఫైయింగ్‌ మూమెంట్

చండీగఢ్‌ : డాన్స్‌ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు పాప్‌ సంగీత రారాజు ‘మైఖెల్‌ జాక్సన్‌’. ఆయన చేసిన మూమెంట్స్‌లో ప్రముఖమైనవి ‘మూన్‌వాక్‌’, ‘ గ్రావిటీ డిఫైయింగ్‌’. నేటి తరం ఆయనలా డాన్స్‌ చేయాలని ముఖ్యంగా ఈ రెండిటిని చేసి అందరి మెప్పుపొందాలని చూస్తుంటారు. అయితే మైఖెల్‌లా డాన్స్‌ చేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు న్యూరోసర్జన్లు. ఆయన చేసిన డాన్స్‌ మూమెంట్లను అనుకరించటం ద్వారా వెన్నెముకకు గాయాలయ్యే అవకాశం ఎక్కువంటున్నారు. చండీగఢ్‌కు చెందిన ‘పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’ న్యూరోసర్జన్ల బృందం ఈ విషయాన్ని ధృవీకరించింది.

‘స్మూత్‌ క్రిమినల్‌’ ఆల్బమ్‌లో మైఖెల్‌ జాక్సన్‌ చేసిన 45 డిగ్రీ బెండ్‌ మూమెంట్‌ వల్ల వెన్నెముక దెబ్బ తినే అవకాశం ఉందంటున్నారు. ఎముకలను వేగవంతంగా కదిలించడం, ఒత్తిడికి గురిచేయటం ద్వారా నష్టం వాటిల్లుతుందంటున్నారు. శరీరాన్ని ఒక స్థాయికి మించి వంచడం వల్ల వెన్నెముకకు గాయాలవుతాయని తెలిపారు. వెన్నెముకకు గాయాలైన వారిలో కొంతమందికి ఫిజియోథెరపితో నయం అయితే మరికొంత మందికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందంటున్నారు. ప్రమాదకరమైన భంగిమలతో కూడిన డాన్స్‌లతో శరీర అవయవాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు న్యూరోసర్జన్లు. మెప్పు పొందాలని చూస్తే ముప్పు తప్పదంటున్నారు.

మరిన్ని వార్తలు