మృతదేహంతో 3 వేల కి.మీ. ప్రయాణం.. సెల్యూట్‌

29 Apr, 2020 16:50 IST|Sakshi

మీకు మిజోరాం సెల్యూట్‌ చేస్తోంది: ముఖ్యమంత్రి

‘‘నిజమైన యోధులకు మిజోరాం ఈ విధంగా స్వాగతం పలుకుతోంది. మానవతావాదం, జాతీయవాదాన్ని మేం నమ్ముతాం. తమిళనాడు ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అంటూ మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగ ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియో ప్రశంసలు అందుకుంటోంది. మిజోరాంకు చెందిన వివియన్‌ లాల్రేంసగా28) అనే వ్యక్తి చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. గత వారం చెన్నైలో గుండెపోటుతో మరణించారు. కాగా మహమ్మారి కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు వీలుపడలేదు. దీంతో వివియన్‌ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.(కన్నీళ్లు ఇంకిపోయాయి.. నా బాధ ఎవరికీ పట్టదా?

ఈ క్రమంలో వివియన్‌ మృతదేహాన్ని మిజోరాంకు తీసుకువెళ్లేందుకు జయంతజీరన్‌, చిన్నతంబీ అనే అంబులెన్సు డ్రైవర్లు ముందుకు వచ్చారు. వివియన్‌ స్నేహితుడి సహాయంతో దాదాపు 3 వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి బాధితుడి కుటుంబ సభ్యుల వేదన తీర్చారు. 84 గంటల పాటు ప్రయాణం చేసి బుధవారం ఐజ్వాల్‌కు చేరుకుని వివియన్‌ శవపేటికను వారికి అప్పగించారు. ఈ క్రమంలో మిజోరాం ప్రజలు వారిని హృదయపూర్వకంగా.. చప్పట్ల మోతతో తన రాష్ట్రంలోకి ఆహ్వానించారు. రియల్‌ హీరోలు అంటూ ప్రశంసలు కురిపించారు.(కరోనా: మీద పడి రిజిస్టర్‌ చించేశారు!)

ఈ విషయంపై ట్విటర్‌ వేదికగా స్పందించిన సీఎం జోరంతంగ.. అంబులెన్సు డ్రైవర్ల సేవా గుణాన్ని కొనియాడారు. వారికి చెరో రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వడంతో పాటుగా.. మిజో సంప్రదాయ దుస్తులు బహూకరిస్తామని తెలిపారు. మిజోరాం మీకు సెల్యూట్‌ చేస్తోందని వ్యాఖ్యానించారు. కాగా మిజోరాంలో ఇప్పటి వరకు ఒకే ఒక్క కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసు నమోదైంది. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, సిక్కిం, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌ కరోనా రహిత రాష్ట్రాలుగా నిలిచిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు