రాష్ట్ర సమస్యల్ని పరిష్కరించాలని ప్రధానిని కోరా

17 Feb, 2016 03:04 IST|Sakshi
రాష్ట్ర సమస్యల్ని పరిష్కరించాలని ప్రధానిని కోరా

పార్లమెంటు సజావుగా జరగాలన్నదే అందరి అభిప్రాయం: మేకపాటి

 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రధాని మోదీని వైఎస్సార్ సీపీ తరఫున కోరినట్టు పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఇక్కడి సౌత్‌బ్లాక్‌లోని ప్రధాని కార్యాలయంలో మోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీలో ఆయన పాల్గొన్నారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా జరగాలన్న అభిప్రాయంతో అందరూ ఉన్నారని చెప్పారు. 

ఈ సందర్భంగా దేశంలో ఉన్న సమస్యలతోపాటు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాలని ప్రధానిని తాను కోరానని మేకపాటి వివరించారు. ‘ఆనాడు రాష్ట్రాన్ని విభజించినప్పుడు అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభ సాక్షిగా హామీ ఇచ్చారు. మరి సాక్షాత్తూ ప్రధాని ఇచ్చిన వాగ్దానమే నెరవేరకపోతే ఎలా? ప్రత్యేక హోదా వస్తేనే ఏపీ ముందడుగు వేస్తుంది. అలాగే పునర్విభజన చట్టంలోని అన్ని అంశాల్నీ తు.చ. తప్పక పాటించాలి’ అని మేకపాటి పేర్కొన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగితేనే దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను చర్చించేందుకు వీలు కలుగుతుందని టీడీపీ లోక్‌సభాపక్ష నేత తోట నర్సింహం అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు