నిన్న 'మౌన' మోహన్ ... నేడు సైలెంట్ మోడీ

25 Jul, 2014 16:36 IST|Sakshi
నిన్న 'మౌన' మోహన్ ... నేడు సైలెంట్ మోడీ
సెల్ ఫోన్లు మన్ మోహన్ మోడ్ లో పెట్టుకొండి...మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆయన మీద వచ్చిన జోక్ ఇది. అంతే కాదు. డెంటిస్టు మన్మోహన్ సింగ్ నిని "కనీసం పళ్లు పరీక్ష చేయడానికైనా నోరు తెరవండి మహాప్రభూ..."అన్నారని కూడా జోక్ ప్రచారంలో ఉంది. అంత మౌనంగా పదేళ్లు గడిపేశారు మన్మోహన్ సింగ్. 
 
మన్మోహన్ సింగ్ నిశ్శబ్దంగా ఉంటే ఆయన్ని 'మౌన' మోహన్ సింగ్ అన్నారు. ఆయన తరువాత ప్రధాని అయిన నరేంద్ర మోడీ కూడా నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఆయన తరఫు నుంచి మాటా లేదు, పలుకూ లేదు. ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే - "ఈ మౌనం, ఈ బిడియం ఇదేనా ఇదేనా మోడీ కానుక?
 
ఎన్నికల ప్రచార సమయంలో రోజుకు నాలుగు సభల్లో మాట్లాడి, చాయ్ పే చర్చలు చేసిన మోడీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అప్పుడప్పుడూ ట్వీట్లు తప్ప మాటలు ఎందుకు లేవు? సానియా వివాదంలో మోడీ ఒక్క మాట మాట్లాడితే గొడవ సర్దుకుపోయి ఉండేది. కానీ మోడీ నోరు విప్పలేదు. 
 
తానే కాదు, తన మంత్రులు కూడా నోరు తెరవొద్దని మోడీ ఆదేశించారట. "విలేఖరులతో మాట్లాడొద్దు. ఏది పడితే అది చెప్పొద్దు. తెలియని వారు సెల్ ఫోన్లు, కెమెరా ఉన్న పెన్లు, కెమెరాలను తీసుకురాకుండా చూడండి. స్టింగ్ ఆపరేషన్ల విషయంలో జాగ్రత్త" అని హెచ్చరించారట మోడీగారు. 
 
మోడీ ప్రధాని అయితే పూటగో ప్రసంగం, గంటకో చర్చ ఉంటుందని అనుకున్న వారందరికీ ఈ సైలెంట్ మోడ్ ఎందుకో అర్ధం కావడం లేదు. ట్వీటులు కాదు... మాటలు కావాలి మహాప్రభూ....!!!
మరిన్ని వార్తలు