నిర్భయ కేసు: చివరి కోరికల్లేవ్‌ కానీ ఉరి తర్వాత!

20 Mar, 2020 16:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉరి అమలుకు ముందు నిర్భయ దోషులు చివరి కోరిక చెప్పలేదని తీహార్‌ జైలు అధికారులు వెల్లడించారు. అయితే ఇద్దరు దోషులు తాము చనిపోయాక చేయాల్సిన పనుల గురించి జైలు సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టరు నెహాల్‌ బన్సాల్‌ ఉరికి గంట ముందు జైలుకి వెళ్లి దోషుల చివరి కోరికల గురించి తెలుసుకున్నారు. దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ మరణానంతరం అవయవాలను దానం చేయాలని కోరాడు. అవయదానానికి అవసరమైన పత్రంపై కూడా సంతకాలు చేశాడని అధికారులు వెల్లడించారు. (చదవండి: జైల్లో నిర్భయ దోషుల సంపాదనెంతో తెలుసా..!)

అయితే ఉరి తీసిన అనంతరం అరగంటపాటు వారి శరీరాలను అలానే వేలాడదీయడంతో కీలక అవయవాలు దానానికి పనికిరావని తెలుస్తోంది. ముఖేష్‌ సింగ్‌ ఉరికి ముందు తనను ఉరి తీయొద్దంటూ బతిమాలాడుతూ, తీవ్ర మనోవేదనకు గురయ్యాడని తెలుస్తోంది. మరో దోషి వినయ్ శర్మ కూడా తన మరణానంతరం.. జైల్లో ఉన్నప్పుడు తాను వేసిన పెయింటింగులను సూపరింటెండెంట్‌కు ఇవ్వాలని కోరాడు. తాను చదివిన హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, తన ఫొటోగ్రాఫ్‌ను కుటుంబానికి అందించాలి కోరాడు. మిగతా ఇద్దరు పవన్‌ గుప్తా, అక్షయ్ సింగ్ మాత్రం ఎలాంటి కోరికా కోరలేదని సమాచారం. (చదవండి: నిర్భయ కేసు: 30 నిమిషాలపాటు ఉరి తీశాం!)

మరిన్ని వార్తలు